Women Health: ఈ రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. అనేక కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న వయస్సులోనే స్త్రీ, పురుషులు హార్ట్ ఎటాక్‌కి గురవుతున్నారు. చాలామంది వీటిని నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొత్తగా పిల్లలను కనలేని మహిళలకు గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ (MGH) పరిశోధకులు నిర్వహించారు. దీనిని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. ‘స్త్రీలో సంతానం లేని సమస్య భవిష్యత్తులో గుండె జబ్బులకి కారణమవుతుందని మేము గుర్తించాం. ఒక మహిళ గర్భవతి కావడం కష్టంగా ఉన్నా అలాగే రుతువిరతి సమయంలో సమస్యలు ఉంటే అలాంటి మహిళల్లో కూడా గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మహిళల్లో గుండె ఆగిపోయే ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉంటుంది’ అని తేల్చారు.
రుతుక్రమం ఆగిపోయిన 38,528 మంది స్త్రీలను ఈ పరిశోధనలో చేర్చారు. వారిలో 14 శాతం మంది మహిళలు తమకు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పారు.15 సంవత్సరాల ఫాలో-అప్ తర్వాత వంధ్యత్వం గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 16 శాతం పెంచుతుందని పరిశోధకులు నివేదించారు. మహిళలు రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, ధూమపానం మానేయడం వంటివి తప్పకుండా పాటించాలని సూచించారు.
అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.