AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: వర్షాకాలం వ్యాధుల బారిన పడకూడదంటే.. ఈ పండ్లను తప్పక తీసుకోవాల్సిందే..

Health: ప్రస్తుతం వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాకాలం చల్లటి వాతావరణంతో పాటు వ్యాధులను సైతం తీసుకొస్తుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వాతావరణంలో ఒక్కసారిగా జరిగే మార్పుల కారణంగా...

Health: వర్షాకాలం వ్యాధుల బారిన పడకూడదంటే.. ఈ పండ్లను తప్పక తీసుకోవాల్సిందే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2022 | 5:55 PM

Health: ప్రస్తుతం వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాకాలం చల్లటి వాతావరణంతో పాటు వ్యాధులను సైతం తీసుకొస్తుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా వాతావరణంలో ఒక్కసారిగా జరిగే మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. జలుబు నుంచి మొదలు జ్వరం వరకు వేధిస్తుంటాయి. అయితే మారిన కాలంతో వచ్చే వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే కచ్చితంగా మనలో రోగ నిరోధశక్తి బలంగా ఉండాలి. అలా అయితేనే వ్యాధులను తట్టుకునే శక్తి మనకు వస్తుంది. మరి వర్షాకాలంలో వేడి వేడి బజ్జీలు మాత్రమే కాదు, కొన్ని రకాల పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేరేడు పండ్లు..

వర్షాకాలంలో ప్రత్యేకంగా లభించే నేరేడు పండ్లతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులోని పోషకగుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ సీలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మారడంలో ఉపయోగపడతాయి.

యాపిల్స్‌..

కాలంతో సంబంధం లేకుండా లభించే యాపిల్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు. యాపిల్స్‌లో ఉండే విటమిన్‌ సీతో పాటు క్వెర్సెటిన్ అనే ఫ్లవనాయిడ్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

దానిమ్మ..

దానిమ్మను ఇష్టపడని వారు ఉండరు. రుచికి కేరాఫ్‌గా నిలిచే ఈ ఫ్రూట్ ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా దానిమ్మ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గ్రీన్‌ కంటే ఉత్తమ డిటాక్స్‌గా దానిమ్మ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అరటి పండు..

అరటి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్‌ బీ6 రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాలంతో సంబంధం లేకుండా లభించే ఈ పండును ప్రతీ ఒక్కరూ డైట్‌లో భాగం చేసుకోవాలి.

పియర్స్‌..

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పియర్స్‌ది ప్రత్యేక స్థానం. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌ సి, యాంటి ఇన్ఫమేటరీ ఫ్లవనాయిడ్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన సమాచారం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అని గుర్తించాలి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందనేది నిజమే అయినప్పటికీ. రోగ నిరోధ శక్తి తగ్గడానికి ఇతర ఇతర అంశాలు కూడా కారణమవుతుంటాయి. కాబట్టి వ్యాధుల బారిన పడితే సొంత వైద్యంపై ఆధార పడకుండా వైద్యులను సంప్రదించాలి.