
సాధారణంగా 7 నుండి 8 గంటల నిద్రను ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వెనుక మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు లేదా కొన్ని రకాల మందుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డిప్రెషన్‌తో బాధపడేవారు లేదా తక్కువ శారీరక శ్రమ చేసేవారిలో ఈ అతి నిద్ర సమస్య కనిపిస్తుంటుంది. శరీరంలో అంతర్గతంగా పేరుకుపోయిన వాపు (Inflammation) లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరం ఎక్కువ విశ్రాంతిని కోరవచ్చు. మరి అతి నిద్ర ఏయే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందో, దీనిని ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
అతి నిద్ర వెనుక ఉన్న ప్రధాన కారణాలు:
డిప్రెషన్ : మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ ఉన్నవారు సాధారణం కంటే ఎక్కువ సమయం నిద్రపోయే అవకాశం ఉంది. ‘నర్స్ హెల్త్ స్టడీ II’ ప్రకారం, డిప్రెషన్ లక్షణాలున్న మహిళల్లో 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉంది.
దీర్ఘకాలిక అనారోగ్యాలు: డయాబెటిస్, హైపోథైరాయిడిజం, శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులతో బాధపడేవారిలో శరీరం కోలుకోవడానికి ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది.
మందుల ప్రభావం: యాంటీ-డిప్రెసెంట్స్ లేదా యాంగ్జైటీ కోసం వాడే మందులు నిద్ర వ్యవధిని పెంచుతాయి.
జీవనశైలి: వ్యాయామం లేకపోవడం, అతిగా మద్యం సేవించడం వంటివి కూడా నిద్ర అలవాట్లపై ప్రభావం చూపుతాయి.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అతి నిద్ర అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది శరీరంలోని రోగ నిరోధక శక్తి బలహీనపడటానికి ఒక గుర్తు. ఇది గుండె సంబంధిత వ్యాధులు స్థూలకాయానికి దారితీసే ప్రమాదం ఉంది. కేవలం నిద్ర గంటలను మాత్రమే కాకుండా, నిద్ర నాణ్యతను కూడా గమనించడం ఎంతో ముఖ్యం.
మీరు క్రమం తప్పకుండా 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతున్నట్లయితే, అది మీ శరీరంలో దాగి ఉన్న ఏదైనా అనారోగ్యానికి హెచ్చరిక కావచ్చు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి, మీ శారీరక మానసిక ఆరోగ్య స్థితిని తనిఖీ చేసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యకరమైన జీవనశైలి క్రమబద్ధమైన నిద్ర అలవాట్లు మీ ఆయుష్షును పెంచుతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.