
అత్యధిక ప్రొటీన్ సోర్స్ గా పేరున్న గుడ్డును రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా గర్భం దాల్సిన మహిళలకు దీని నుంచి అందే పోషకాలు ఎంతో విలువైనవని చెప్తారు. వారు మాత్రమే కాదు ఎలాంటి ఆరోగ్య సమస్యలులేని వారు కూడా గుడ్డును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి పోషక విలువల గురించి తెలిసినప్పటికీ చాలా మంది గుడ్లను డైట్ లో తీసుకోవడంలో సందేహిస్తారు. అందుకు కారణం వీటి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ , గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుందని భయపడుతుంటారు. ఈ ప్రశ్నకు పోషకాహార నిపుణులు చెప్తున్న సమాధానాలు ఇలా ఉన్నాయి.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇది శరీరంపై ప్రతికూల ప్రభావమేమీ చూపదంటున్నారు. దీని ద్వారా లభించే కొలెస్ట్రాల్ కారణంగా గుండెకు వచ్చే ఇబ్బందేమీ లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గుడ్లలో ప్రొటీన్, విటమిన్లు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి.
గుడ్డులోని పచ్చసొనలో ఉండే ప్రత్యేక గుణాలు ఎముకల ఆరోగ్యానికి, విటమిన్ డిని అందించేందుకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో సైతం మెదడుకు అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. ప్రతిరోజూ గుడ్లను తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని వారు తెలిపారు. అయితే, గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం రోజుకు ఒక గుడ్డుతో సరిపెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉన్నవారు వారానికి ఏడు గుడ్లు వరకు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుందని తేలింది. స్ట్రోక్ , మాలిక్యులర్ డీజనరేషన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది. ఇది అంధత్వానికి దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి. గుండె సమస్యలు ఉన్నవారు వీటిని రోజుకొకటి తినడంలో ప్రమాదమేమీ కాదంటున్నారు. కానీ, ఎవరికైతే ఇప్పటికే మధుమేహం వ్యాధి ఉందో వారు గుడ్డు తినడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)