
వాతావరణ మార్పుల వల్ల వడగాల్పుల తీవ్రత ఏటేటా పెరుగుతోందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో కాంక్రీట్ భవనాల వల్ల వేడి రెట్టింపు అవుతోంది. ఈ తరుణంలో ఆస్టర్ CMI, ఫోర్టిస్ వంటి ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు ‘హీట్ మేనేజ్మెంట్’ కోసం కొన్ని కీలక సూచనలు చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులు గర్భిణీలు ఈ ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందా..
1. హైడ్రేషన్ – అత్యంత కీలకం:
దాహం వేయకపోయినా ప్రతి గంటకు నీళ్లు తాగుతూ ఉండాలి. మంచినీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి. కాఫీ, టీ, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది.
2. సమయ పాలన పాటించండి:
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే.. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, గొడుగు లేదా టోపీ తప్పనిసరిగా వాడాలి.
3. చలువ చేసే ఆహారం:
వేసవిలో నూనె వస్తువులు, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. పుచ్చకాయ, కీరదోస, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి.
4. వడదెబ్బ లక్షణాలను గుర్తించండి:
తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, వికారం, విపరీతంగా చెమట పట్టడం లేదా అస్సలు పట్టకపోవడం, కండరాల నొప్పులు వంటివి వడదెబ్బకు తొలి సంకేతాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్ళి, నీరు తాగి విశ్రాంతి తీసుకోవాలి. పరిస్థితి విషమిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
5. ఇంటిని చల్లగా ఉంచుకోండి:
మధ్యాహ్నం వేళ కిటికీలకు కర్టెన్లు వేసి ఉంచాలి. గాలి తగిలేలా వెంటిలేషన్ చూసుకోవాలి. వీలైనప్పుడు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తక్షణమే తగ్గుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోగలరు.