
రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగే వారికి.. కాఫీ తాగని వారితో పోలిస్తే ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. కాఫీలో చక్కెర లేదా కొవ్వు పదార్థాలను ఎక్కువగా కలిపితే ఈ ప్రయోజనాలు తగ్గిపోతాయి. చక్కెర తక్కువగా కలిపినప్పుడు మరణ ప్రమాదం 14 శాతం తగ్గిందని అధ్యయనం వివరాలు చెబుతున్నాయి.
ఈ అధ్యయనం కోసం అమెరికాలో 1999 నుండి 2018 మధ్య జరిగిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES) డేటాను వాడారు. దానికి నేషనల్ డెత్ ఇండెక్స్ నుండి మరణాల వివరాలను కలిపి విశ్లేషించారు.
అమెరికాలో సగం మందికి పైగా రోజూ కనీసం ఒక కప్పు కాఫీ తాగుతున్నారు. కాబట్టి ఇది ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం చాలా అవసరం అని అధ్యయనానికి నాయకత్వం వహించిన వారు చెప్పారు.
కాఫీలో ఉండే జీవక్రియలో చురుకుగా ఉండే పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేయవచ్చని తెలిపారు. కానీ చక్కెర, సాచ్యురేటెడ్ ఫ్యాట్ ను ఎక్కువగా కలిపితే కాఫీ వల్ల వచ్చే లాభాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలు.
రోజుకు కేవలం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 16 శాతం తగ్గుతుందని తేలింది. రోజుకు 2 నుంచి 3 కప్పులు తాగేవారికి ఈ ప్రయోజనం 17 శాతం వరకు పెరిగింది. అయితే రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగడం వల్ల అదనపు రక్షణ లభించలేదు. దీనికి విరుద్ధంగా ఎక్కువ కాఫీ తాగితే గుండె సంబంధిత మరణాల ప్రమాదం తగ్గడం అనే సంబంధం బలహీనపడింది. కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదానికి పెద్దగా సంబంధం లేదని కూడా అధ్యయనం వెల్లడించింది.
మీరు రోజూ బ్లాక్ కాఫీ తాగితే తక్కువ చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు లేకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే అన్నీ మోతాదులో ఉండాలి. దీన్ని అలవాటుగా చేసుకుంటే.. దీర్ఘకాలికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)