Pregnancy: ప్రసవం తర్వాత మహిళలకు కొత్త రిస్క్.. 15 ఏళ్ల వరకు జాగ్రత్త పడాల్సిందే..

ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం (పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ - PPH) గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. PPH అనేది ప్రసవం తర్వాత గంటలోపు లేదా కొన్నిసార్లు 24 గంటలలోపు సంభవించే తీవ్రమైన రక్తస్రావం. ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లి మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి. అయితే, ఈ సమస్య దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై, ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై, గతంలో పెద్దగా పరిశోధన జరగలేదు.

Pregnancy: ప్రసవం తర్వాత మహిళలకు కొత్త రిస్క్.. 15 ఏళ్ల వరకు జాగ్రత్త పడాల్సిందే..
Postpartum Risks In Women

Updated on: Jun 29, 2025 | 12:40 PM

ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం (పోస్ట్-పార్టమ్ హెమరేజ్ – PPH) అనేది మహిళల ప్రాణాలకు ముప్పు తెచ్చే తీవ్రమైన సమస్య. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తుంది. అయితే, తాజాగా వెలువడిన ఒక అంతర్జాతీయ అధ్యయనం PPH కేవలం తాత్కాలిక అత్యవసర పరిస్థితి కాదని, ఇది మహిళల గుండె ఆరోగ్యానికి దీర్ఘకాలికంగా ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఈ ప్రభావం ప్రసవం జరిగిన తర్వాత పదిహేనేళ్ల వరకు కొనసాగవచ్చని అధ్యయనం హెచ్చరించింది.

గుండెకు ముప్పు..

‘ది జర్నల్ ఆఫ్ మెటర్నల్-ఫీటల్ & నియోనాటల్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ పరిశోధన, యూకే, అమెరికా, కెనడా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాల నుంచి 9.7 మిలియన్లకు పైగా మహిళల డేటాను విశ్లేషించింది. 1986 నుంచి 2018 మధ్య నిర్వహించిన పది మునుపటి అధ్యయనాల వివరాలను కూడా ఈ పరిశోధనలో పొందుపరిచారు. PPHతో బాధపడిన మహిళలకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 1.76 రెట్లు ఎక్కువ అని అధ్యయనం కనుగొంది. గుండె వైఫల్యం, స్ట్రోక్, రక్తపు గడ్డలు (థ్రోంబోఎంబోలిజం) వంటి తీవ్రమైన గుండె సంబంధిత పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా, రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం 2.1 రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పదిహేనేళ్ల వరకు రిస్క్.. !

ఈ ఆరోగ్య ప్రమాదాలు ప్రసవం జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో అత్యధికంగా ఉన్నా, అవి పదిహేనేళ్ల వరకు కొనసాగవచ్చని అధ్యయనం వివరిస్తుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు (ప్రీఎక్లాంప్సియా) వంటి సమస్యలు ఎదుర్కొన్న మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ అని పరిశోధకులు తెలిపారు. PPH సాధారణంగా రక్తస్రావం నియంత్రించిన తర్వాత ముగిసే అత్యవసర పరిస్థితిగానే చూస్తారు. కానీ తమ అధ్యయనం మహిళల గుండె ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని ఇండోనేషియాలోని ఎయిర్లంగ్గా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మంగళ పాస్కా వార్ధానా అభిప్రాయపడ్డారు. ప్రసవం తర్వాత కూడా తల్లుల సంరక్షణ కొనసాగాలని ఆయన నొక్కిచెప్పారు.

ప్రసూతి మరణాలు దీనివల్లే..

ప్రతి సంవత్సరం సుమారు 14 మిలియన్ల మంది మహిళలు PPHతో బాధపడుతున్నారు. ప్రసూతి మరణాలలో దాదాపు 20% దీని వల్లే సంభవిస్తాయి. PPH అనుభవించిన మహిళలు ప్రసవం తర్వాత వారి సంరక్షణలో భాగంగా సాధారణ గుండె పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలు గుండె జబ్బులను ముందుగానే గుర్తించి నివారించడంలో సహాయపడతాయి. ఈ ప్రమాదాలు ఎందుకు సంభవిస్తాయి, వాటిని ఎలా తగ్గించవచ్చు అనే దానిపై మరింత పరిశోధన అవసరమని డాక్టర్ ఫికిహ్ ఫైజారా ఉస్తాడి తెలిపారు. అధిక ఆదాయ దేశాల డేటాతోనే ఈ అధ్యయనం ఎక్కువగా జరిగిందని, తక్కువ మధ్య ఆదాయ దేశాలలో PPH మహిళలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.