మధుమేహం.. సైలెంట్ కిల్లర్ గా పేరుపొందిన ఈ రోగం మనిషి మనిషిగానే ఉంచి లోపల లోపల క్షీణింపజేస్తూ ఉంటుంది. అంతా అయిపోయాక విషయం గ్రహించినా పెద్దగా చేయగల్గింది ఏమి ఉండదు. ప్రాణాలు హరించినా ఆశ్చర్యపోనక్కర లేదు. అందుకనే ఈ వ్యాధిపై చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు షుగర్ వ్యాధి ఏంటి? ఎందుకు వస్తుంది? సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దాని కారణంగా జరిగే నష్టాలు ఏమిటి అన్న విషయాలపై కూలంకషంగా చర్చిద్దాం..
మారుతున్న జీవన విధానంలో చిన్నా పెద్దా తేడా లేదు. బీద ధనిక తారతమ్యం లేదు. అందరినీ మధుమేహం అనే మహమ్మారి చుట్టేస్తోంది. దీనిక ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, వంశపార్యంగా రావడం, శారీరక శ్రమలేని ఉద్యోగ జీవితం. ఇవే ప్రధానంగా షుగర్ వ్యాధి రావడానికి ప్రేరేపించే కారణాలు.
ప్రతి ఒక్కరి రక్తంలో గ్లూకోజ్ ఉంటుంది. ఇది ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువ ఉంటే దానిని డయాబెటిస్ అంటారు. ఇది వరకూ ఇదీ వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు వయసుతో భేదం లేదు. యువతలో కూడా చాలా మంది ఈ రోగం బారిన పడుతున్నారు.
శరీరంలో ఉండాల్సిన స్థాయి కన్నా అధికంగా షుగర్ పెరిగితే అది శరీరంలోని అన్ని శరీర భాగాలపైనా ప్రభావం చూపుతుంది. అలా వదిలేస్తే కనిపించకుండానే మొత్తం మనిషేనే చంపేస్తుంది. అందుకే నిపుణులు నిత్యం మధుమేహం చెకప్ చేయించుకుంటూ మందులు వాడాలని సూచిస్తున్నారు.
అరికాలు సమస్యలు.. షుగర్ ఉన్న వారి అరి కాలిలో ఏమైనా చిన్న గాయం అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలి. వీలైనంత వరకూ అది పుండు పడకుండా జాగ్రత్తపడాలి. అలాగే సాధారణంగా షుగర్ ఎక్కువ ఉన్నవారి ఫుట్ అల్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటివి కాలిలో కనిపించినప్పుడు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.
కంటి సమస్యలు.. షుగర్ స్థాయిలు అదుపులోని లేని వారిలో కొంతమందికి చూపు సమస్యలు కూడా రావచ్చు. దీనిని డయాబెటిక్ రెటినోపతీ అని పిలుస్తారు. దీని వల్ల తొలుత చూపు మందగించడం.. ఆ తర్వాత అంధత్వం కూడా సంభవించవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు రెగ్యూలర్ గా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్.. అదుపులో లేని షుగర్ కారణంగా రక్తనాళాలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
కిడ్నీ సమస్యలు.. కంట్రోల్లో లేని షుగర్ కారణంగా కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. దీని వల్ల కిడ్నీలపై అధిక భారం పడి పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. చివరికి డయాలిస్ కు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
లైంగిక సమస్యలు.. షుగర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే రక్తనాళాలు, నరాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరగక, లైంగిక అవయవాలకూ కూడా రక్తం అందదు. పలితంగా లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులు రెగ్యూలర్ గా చెకప్ చేయించుకోవడం, మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం చేయాలి. రోజూ వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి. వీలైనంత వరకూ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. శరీరానికి సరిపడినంత బరువు ఉంచుకుంటూ మందులు సమయానికి వాడాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..