
ప్రోటీన్ లోపం మన శరీరంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. మనం ప్రతిరోజూ తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ మన శరీరానికి శక్తిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే, మీరు క్రమంగా బలహీనంగా తయారవుతారు. చిన్నపాటి పనులు చేసినా కూడా త్వరగా అలసటకు గురవుతారు. శక్తి లేకపోవడం వల్ల రోజువారీ కార్యకలాపాలు కూడా కష్టంగా అనిపిస్తాయి. ప్రోటీన్ లోపం కేవలం కండరాల బలహీనతకు మాత్రమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి కూడా హానికరం. ప్రోటీన్ ఎముకల సాంద్రతను కాపాడటానికి సహాయపడుతుంది. తగినంత ప్రోటీన్ లేకపోతే ఎముకలు బలహీనమవుతాయి. దీనివల్ల చిన్నపాటి గాయాలకే లేదా ఒత్తిడికే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది. వృద్ధుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే జుట్టు ఎక్కువగా రాలిపోవడం ఒక సాధారణ సమస్య. ప్రోటీన్ జుట్టు నిర్మాణానికి అవసరమైన కెరాటిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ లోపం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది, నిస్తేజంగా కనిపిస్తుంది సులభంగా విరిగిపోతుంది. చర్మ ఆరోగ్యం కూడా ప్రోటీన్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ చర్మ కణాల మరమ్మత్తు కొత్త కణాల ఉత్పత్తికి అవసరం. తగినంత ప్రోటీన్ లేకపోతే చర్మం పొడిబారుతుంది, నిర్జీవంగా మారుతుంది మరియు వివిధ రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గాయాలు కూడా త్వరగా మానవు. శరీరానికి తగినంత ప్రోటీన్ లేకపోతే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ప్రోటీన్ యాంటీబాడీస్ ఉత్పత్తికి అవసరం, ఇవి ఇన్ఫెక్షన్లు వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. ప్రోటీన్ లోపం ఎక్కువగా ఉంటే శరీరం ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది తరచూ అనారోగ్యాల బారిన పడతారు.
పిల్లల సరైన ఎదుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. ఇది కండరాలు, ఎముకలు ఇతర కణజాలాల నిర్మాణానికి సహాయపడుతుంది. పిల్లల ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే వారి ఎదుగుదల మందగిస్తుంది. వారు వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు మరియు బరువు పెరగరు. అంతేకాకుండా, వారి మానసిక అభివృద్ధి కూడా ప్రభావితం కావచ్చు.
ప్రోటీన్ లోపం వల్ల కొందరు వ్యక్తులు విపరీతంగా బరువు తగ్గిపోతారు. ప్రోటీన్ శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది, ఇవి కండరాల నిర్మాణానికి మరియు నిర్వహణకు ముఖ్యమైనవి. ప్రోటీన్ లోపం కండరాల క్షీణతకు దారితీస్తుంది. ప్రోటీన్ మన శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి కూడా సహాయపడుతుంది. తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే శరీర కణజాలాలలో ద్రవం పేరుకుపోతుంది. దీనివల్ల కాళ్లు, చేతులు, పొట్ట మరియు ఇతర భాగాలలో వాపు వస్తుంది. ఈ వాపుల వల్ల నొప్పులు కూడా వస్తాయి.
గోళ్లు బలహీనంగా మారడం, సులభంగా విరిగిపోవడం.
చర్మం నిస్తేజంగా మారడం.
నిరంతరం అలసట, బలహీనత.
ఏకాగ్రత కుదరకపోవడం.
మూడ్ స్వింగ్స్, చిరాకు.
చిన్న గాయాలు కూడా ఆలస్యంగా మానడం.