పురుషులకు ప్రాణాంతకమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు భారత్లో ఎక్కువ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ను ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నెలగా ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 50 ఏళ్ల లోపు వయస్సున్న వారు ఈ పౌరుష గ్రంధి క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. పైగా దాని తీవ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. మిగిలిన వాటితో పోలిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా విస్తరిస్తుందని.. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా ఈ వ్యాధి పెద్దవాళ్లలో అంటే వృద్ధులలో మాత్రమే కనిపించేది.. ప్రస్తుతం యువకులు, మిడిల్ ఏజ్ వాళ్లలో కూడా పౌరుష గ్రంధి క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీలలో నివసించే 35 నుండి 44 మధ్య ఏజ్ ఉన్న వారిలో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని.. ఇది ఆందోళన కలిగిస్తుందని వారు తెలిపారు. 2022లో భారత్ లో 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవగా.. అందులో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కేసులు 37,948 అని.. మొత్తం క్యాన్సర్ కేసుల్లో మూడు శాతం ఉండటం ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు.
సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రోస్ట్రేట్ క్యాన్సర్ నుంచి బయటపడచ్చని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ నుంచి బతికి బయటపడడం అనేది మనం దాన్ని ఎంత త్వరగా గుర్తించామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ శరీరంలో చాలా నెమ్మదిగా విస్తరిస్తోంది. కాబట్టి తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య ఉండదు. అమెరికాలో 80 శాతం మంది బాధితులు తొలి దశలోనే చికిత్సకు వస్తున్నారని.. 20 శాతం మంది వ్యాధి ముదిరిపోయిన తర్వాత డాక్టర్లను కలుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ భారత్ లో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పౌరుష గ్రంధి క్యాన్సర్ (Prostate cancer) పురుషులలోను, వృద్ధులలో అత్యధికంగా పౌరుష గ్రంధికి వచ్చే క్యాన్సర్.. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా ఉండటం.. రాత్రి పదే పదే లేవాల్సి రావటం, మూత్రంలో రక్తం పడటం, నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి ఉండటం ప్రోస్టేట్ క్యాన్సర్ కు సూచనలని వైద్యులు చెబుతున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..