
మీకు వస్తున్న దగ్గు గాలిలో ఉన్న ధూళి వల్ల వస్తుందా లేక వైరస్ ప్రభావం వల్లా? ఈ సందేహం చాలామందిని వేధిస్తుంటుంది. వైరల్ దగ్గుతో పాటు జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి ఇతర లక్షణాలు ఉంటే.. కాలుష్యం వల్ల వచ్చే దగ్గు కేవలం బయట తిరిగినప్పుడు లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. కారణం ఏదైనప్పటికీ, దగ్గు వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోవడం సరైన చికిత్సకు మొదటి మెట్టు. పల్మనాలజిస్టుల విశ్లేషణ ప్రకారం కాలుష్య, వైరల్ దగ్గుల లక్షణాలు, వాటిని నివారించే మార్గాల గురించి వివరంగా తెలుసుకోండి.
కాలుష్య దగ్గు :
నమూనా: మీరు బయటకు వెళ్ళినప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా దుమ్ము ఎక్కువగా ఉన్న చోట దగ్గు పెరుగుతుంది. ఇంటి లోపలికి రాగానే దగ్గు తగ్గుముఖం పడుతుంది.
లక్షణాలు: ఇది పొడి దగ్గులా ఉంటుంది. గొంతులో గీర, కళ్లు మండటం, కళ్ల నుండి నీరు కారడం, ఛాతీలో బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఎవరికి ముప్పు?: ఆస్తమా, అలర్జీ లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ దగ్గు త్వరగా వస్తుంది.
వైరల్ దగ్గు :
లక్షణాలు: ఇది ఒంటరిగా రాదు. దీనితో పాటు జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, అలసట మరియు ఒళ్లు నొప్పులు ఉంటాయి.
సమయం: ఇది క్రమంగా పెరుగుతూ.. వారం పది రోజుల్లో తగ్గుతుంది. మొదట పొడిగా ఉన్నా, తర్వాత కఫంతో కూడిన దగ్గుగా మారుతుంది.
రెండు కలిస్తే? : ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గాక కూడా కాలుష్యం వల్ల దగ్గు కొన్ని వారాల పాటు కొనసాగవచ్చు. దీన్ని ‘పోస్ట్-వైరల్ దగ్గు’ అంటారు. ఈ సమయంలో ఊపిరితిత్తులు చాలా సున్నితంగా మారి, చిన్న ధూళి కణానికీ దగ్గు వచ్చేలా చేస్తాయి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం.
దగ్గులో రక్తం పడటం.
ఛాతీ నొప్పి లేదా విపరీతమైన నీరసం.
ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం..
గమనిక : పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దగ్గు వారం కంటే ఎక్కువ కాలం వేధిస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన పల్మనాలజిస్టును సంప్రదించడం ఉత్తమం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోకండి.