
రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోవడం అనేది చిన్న వయసులోనే ప్రారంభమవుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే, స్క్రీనింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయాలని, అలాగే గతంలో 40 ఏళ్లకు చేసే రిస్క్ అసెస్‌మెంట్‌ను ఇప్పుడు 30 ఏళ్ల నుండే ప్రారంభించాలని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, గుండె ఆరోగ్యంపై మారిన నిబంధనలు మరియు వాటి ప్రభావాల గురించి తెలుసుకుందాం..
గతంలో వాడిన ‘ASCVD’ రిస్క్ స్కోర్ స్థానంలో ఇప్పుడు ‘PREVENT’ అనే అధునాతన మోడల్‌ను ప్రవేశపెట్టారు. ఇది కేవలం పదేళ్ల ముప్పునే కాకుండా, 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో గుండె ఆరోగ్యం ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది. కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా, కిడ్నీ పనితీరు (eGFR), రక్తంలోని చక్కెర స్థాయిల (HbA1c) ఆధారంగా ఇది ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల ఒక వ్యక్తి మెటబాలిక్ ఆరోగ్యం గుండెపై ఎలా ప్రభావం చూపుతుందో ముందే తెలుసుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిల విషయంలో మరింత కఠినంగా ఉండాలి. అధిక ముప్పు ఉన్న వ్యక్తులలో ఎల్‌డీఎల్ స్థాయిలు గతంలో 70 mg/dL ఉండాలని చెప్పగా, ఇప్పుడు దానిని 55 mg/dL కంటే తక్కువకు పరిమితం చేశారు. అలాగే, ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేకుండా, కేవలం జన్యుపరంగా వచ్చే ‘Lp(a)’ అనే మార్కర్‌ను జీవితంలో ఒక్కసారైనా ప్రతి అడల్ట్ పరీక్షించుకోవాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.
స్క్రీనింగ్ వయసును తగ్గించడం వల్ల ‘స్టాటిన్’ మందుల వాడకం దశాబ్దం ముందే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది గుండె జబ్బులను నివారించినప్పటికీ, దశాబ్దాల పాటు మందులు వాడటం వల్ల కండరాల నొప్పులు, చక్కెర స్థాయిలు పెరగడం వంటి దుష్ప్రభావాలు రావచ్చు. ఇది ‘జీవనశైలి మార్పుల’ కంటే ‘ముందస్తు మందుల’ వైపు మొగ్గు చూపేలా చేస్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా తమను తాము ‘రోగులు’గా భావించే ముప్పు ఉంది. ఏది ఏమైనా, చిన్న వయసు నుండే గుండెపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో ప్రాణాపాయాలను తప్పిస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.