Health: మైగ్రేన్ వినడానికి చిన్న సమస్యే అయినా దాంతో బాధపడే వారు అనుభవించే నొప్పి మాత్రం మాటల్లో వర్ణించలేము. బద్దలయ్యే తల నొప్పి చుక్కలు చూపిస్తుంటుంది. ఒక అధ్యయనం ప్రకారం 2019లో భారత్‌లో 213 మిలియన్లకుపైగా ప్రజలు మైగ్రేన్‌తో బాధపడుతున్నారని తేలింది. మరోఆసక్తికరమమైన విషయంమేంటంటే వీరీలో 60 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి.
దేశంలో మెగ్రేన్ సమస్యతో బాధపడుతోన్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని కొల్లామ్‌లోని అమృత స్కూల్ ఆఫ్ ఆయుర్వేదానికి చెందిన శలఖ్య తంత్రా డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శివ బాలాజీ టీవీ9తో తెలిపారు. ముఖ్యంగా వాతా, పిత్తా శరీర స్వభావం కలిగిన వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే మైగ్రేన్ నివారణకు పూర్తిస్థాయిలో నివారణ లేదని, ఆయుర్వేదం కేవలం వ్యాధి తీవ్రతను తగ్గిస్తుందని వివరించారు. ఈ విషయమై డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ‘మా వద్దకు వచ్చే వ్యక్తులు మైగ్రేన్‌ను తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. చాలా ఏళ్లుగా మా వద్దకు వచ్చే రోగులు మేము సూచించే మందులతో ప్రయోజం పొందుతున్నారు’ అని అన్నారు.
మైగ్రేన్ నొప్పి మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్రేరేపిస్తాయని డాక్టర్ బాలాజీ తెలిపారు. అనారోగ్యకరమైన ఆహారం, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసినా మైగ్రేన్ సమస్య వస్తుందని ఆయన అన్నారు. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు పెరుగుకు దూరంగా ఉండాలని అలాగే మళ్లీ మళ్లీ వేడి చేసిన ఆహారాన్ని తీసుకోకూడదని ఆయన సూచిస్తున్నారు. అలాగే మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారు జంక్, స్పైసీ, ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. ఇక ఆయుర్వేదంలో వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మందులు ఇస్తామని బాలాజీ వివరించారు. విపరీతమైన మైగ్రేన్ నొప్పితో బాధపడే వారికి నుదిటిపై వేడి నూనె పోయడం, ముక్కు ద్వారా అందించే మందులు, పంచకర్మ వంటి చికిత్సలను అందిస్తామని తెలిపారు.
మైగ్రేన్‌ను శాశ్వతంగా తరిమికొట్టాలంటే జీవనశైలిలో మార్పులు కూడా చేసుకునే అవసరం ఉందని డాక్టర్ బాలాజీ తెలిపారు. ముఖ్యంగా కనీసం ఎనిమిది గంటల నిద్ర, ఆరోగ్యకరమైన భోజనం, ధూమపానం, మద్యపానం మానేయడం, రోజులో కనీసం 30 నిమిషాల నడక వంటి అలవాట్లను చేసుకోవాలని సూచించారు. ఇక మైగ్రేన్‌కు ఆయుర్వేద చికిత్స తీసుకునే వారు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని, రోగిపై ప్రభావం చూపిన మందుల ఆధారంగనే వైద్యులు వ్యాధిని అంచనా వేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..