Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లే..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి మరణాలకు ఏడవ ప్రధాన కారణం. కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలో గుర్తించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. వికారం, వాంతులు, పాదాల వాపు, మూత్రవిసర్జనలో మార్పులు వంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లే..!
Kidneys

Updated on: Jan 15, 2026 | 8:13 AM

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తంలోని వ్యర్థాలను, శరీరానికి అవసరం లేని ఖనిజాలను మూత్రం ద్వారా బయటకు పంపి, స్వచ్ఛమైన రక్తాన్ని శరీరమంతటా పంపిణీ చేస్తాయి. అయితే, మన జీవనశైలి, తీసుకునే ఆహారం, అలవాట్లు, వంశపారంపర్య సమస్యలు, అనవసరంగా ట్యాబ్లెట్లు మింగడం, ఇతర ఆరోగ్య సమస్యలు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతాయి. కిడ్నీ పనితీరు మందగించి, శరీరంలోని వ్యర్థాల తొలగింపు విధులు సక్రమంగా నిర్వహించలేనప్పుడు పలు రకాల కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరో ప్రమాదం ఏంటంటే, తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ వ్యాధులు ముదిరిపోతాయి. వ్యాధి ముదిరే కొద్దీ లక్షణాలు ఒక్కొక్కటిగా కనిపిస్తాయని, అప్పుడు వైద్య పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.  కిడ్నీ వ్యాధుల రకాలు, లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం…

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD):దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి గురైనవారు దీర్ఘకాలం బాధపడాల్సి వస్తుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది. ప్రారంభదశలో లక్షణాలు కనిపించవు. సరైన వైద్య చికిత్స ద్వారా తీవ్రతరం కాకుండా అదుపులో ఉంచుకోవచ్చు. దీని లక్షణాలు వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండ వద్ద వాపు, తక్కువగా శ్వాస తీసుకోవడం, నిద్రలేమి, ఎక్కువగా లేదా తక్కువగా మూత్రవిసర్జన.

కిడ్నీలో రాళ్లు:మూత్రపిండాల్లో పేరుకుపోయే ఉప్పు లేదా ఇతర ఖనిజాల స్పటికాలను కిడ్నీలో రాళ్లు అంటారు. ఒకటి లేదా రెండు రాళ్లు ఏర్పడినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. నీళ్లు తక్కువగా తాగడం, ఊబకాయం, జీవనశైలి సమస్యలు, ఆహారం కారణంగా ఈ సమస్య వస్తుంది.మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, మూత్రనాళంలో అడ్డంకులు, రాయి ఉన్న భాగంలో నొప్పి ఉంటాయి.

డయాబెటిక్ నెఫ్రోపతీ: డయాబెటిక్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కిడ్నీ వైఫల్యానికి దారి తీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులకు డయాబెటిస్ ప్రధాన కారణం. షుగర్ నియంత్రణలో లేని వ్యక్తుల్లో ఈ డయాబెటిక్ కిడ్నీ వ్యాధి వస్తుంది. కాళ్లు ఉబ్బడం, మూత్రవిసర్జనలో నురుగు రావడం, నీరసంగా ఉండటం, బరువు తగ్గడం, దురదలు, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.

హైపర్‌టెన్సివ్ నెఫ్రోస్క్లెరోసిస్: మధుమేహంతోపాటు మూత్రపిండాలను ప్రభావితం చేసే మరో సమస్య అధిక రక్తపోటు. హైబీపీ కిడ్నీల్లోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది, తద్వారా కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. రక్తం నుంచి వ్యర్థాలను తొలగించే పని దెబ్బతింటుంది. రక్తనాళాల్లో అనవసరమైన ఫ్లూయిడ్స్ పేరుకుపోతాయి, దీంతో రక్తపోటు మరింత పెరుగుతుంది. వికారం, వాంతులు, తలతిరగడం, నీరసంగా ఉండటం, తలనొప్పి, మెడనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI): యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ వ్యాధి కానప్పటికీ, ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. బ్యాక్టీరియా కారణంగా మూత్రనాళంలో ఈ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. ఇన్ఫెక్షన్ పైభాగానికి చేరితే కిడ్నీకి హాని జరుగుతుంది. వెన్నునొప్పి, జ్వరం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపు నొప్పి, మూత్రంలో రక్తం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.

పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (PKD): ఇది కిడ్నీలలోని తిత్తులకు సంబంధించిన జన్యుపరమైన వ్యాధి. కాలక్రమేణా ఇవి పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తాయి.  పొత్తికడుపు పైభాగంలో నొప్పి, పొత్తికడుపు పక్కన నొప్పి, వెన్నునొప్పి, మూత్రంలో రక్తం, తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి.

IgA నెఫ్రోపతీ: ఇదొక రకం కిడ్నీ వ్యాధి. బాల్యం లేదా కౌమారదశలో మొదలవుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మూత్రంతోపాటు రక్తం కూడా వస్తుంది, దీనిని నేరుగా గుర్తించడం కష్టం. వ్యాధి నిర్ధారణ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. కిడ్నీలోని ఫిల్టర్లు (గ్లోమెరులీ) లోపల ఇమ్యునోగ్లోబిన్-ఎ ప్రోటీన్ పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.

కిడ్నీ వైఫల్యం:కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న వారికి వ్యాధి ముదిరిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతను ఐదు స్థాయిలుగా వ్యవహరిస్తారు. నాలుగో దశ వరకు ఎలాంటి లక్షణాలు లేకుండా కనిపించవచ్చు. కిడ్నీల పనితీరు 100 శాతం నుంచి 10 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.  ఆకలి లేకపోవడం, వాంతులు, బాగా నీరసంగా ఉండటం, శరీరం ఉబ్బడం, నిద్రలేమి, ఉబ్బసం.

కిడ్నీ వ్యాధుల తీవ్రతను తగ్గించాలంటే ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించి, వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించాం. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..