ఢిల్లీతోపాటు పలు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. AQI 400 మించి ఉంది. కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఈ కాలుష్యం చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. కాలుష్యం కారణంగా చర్మంపై వాపు, దురద, దద్దుర్లు, నల్ల మచ్చలు వంటివి వస్తాయి. ఇలాంటి మీ చర్మంపై కూడా వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. కాలుష్యం వల్ల వచ్చే చర్మవ్యాధుల ప్రారంభ లక్షణాలు ఇవి. కాలుష్యం వల్ల ఏయే చర్మ వ్యాధులు వస్తాయో? వాటిని ఎలా నివారించవచ్చో? ఈ కింద తెలుసుకుందాం..
కాలుష్యం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీలోని పీఎస్ ఆర్ ఐ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ భావుక్ ధీర్ చెబుతున్నారు. కాలుష్యం ఎగ్జిమా అనే చర్మ వ్యాధిని కలిగిస్తుంది. దీని వల్ల చర్మంలో వాపు, దురద ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మంపై మొటిమల సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడవచ్చు. కొంతమందికి చర్మంపై పిగ్మెంటేషన్ సమస్యలు, దురద కూడా ఉండవచ్చు. ఈ సమస్యలన్నీ ప్రారంభంలో చాలా తేలికగా అనిపించినా, క్రమంగా సమస్యలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రారంభంలోనే వీటిని గుర్తించి, చికిత్స తీసుకోవడం అవసరం.
కాలుష్యంలో ఉండే కణాలు చర్మంతో కలిసిపోయి అక్కడే స్థిరపడతాయని డాక్టర్ ధీర్ హెచ్చరిస్తున్నారు. కాలుష్యం వల్ల వచ్చే దుమ్ము, మట్టిలో PM2.5 చిన్న రేణువులు ఉంటాయి. ఇది చర్మానికి హాని చేస్తుంది. ఎక్కువ సమయం బయట ఉండే వారికి కాలుష్యం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ.