గోదావరి జిల్లాలు అనగానే వారి సాంప్రదాయాలు, మర్యాదలు గుర్తుకువస్తాయి. ఒక పళ్లెం నిండా పట్టుకొచ్చి ముందుపెట్టి తినమంటారు. ఇక ఆహారాల విషయానికొస్తే.. గుత్తివంకాయ, ముద్దపప్పు, ఆవకాయ, పూతరేకులు, కాకినాడ కాజా ఇలా ఎన్నో గుర్తొస్తాయి. వీటిన్నింటితో పాటు అసలైన ఫేమస్ ఐటెమ్ ఇంకొకటి ఉంది. అదే పులస అండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పులస కోసం గోదావరోళ్లు ఎగబడతారు. పులస గురించి ఒక సామెత కూడా ఉందండోయ్. పెళ్లాం పుస్తెలు అయినా తాకట్టు పెట్టి పులస కొనుక్కొని తినమంటారు. అంతాగా ఇది ఫేమస్. మరి ఈ పులస పులుసు మీకు చేయడం రాదా.. టెన్షన్ పడకండి.. మీ కోసమే పులస పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసెద్దాం.
పులస పులుసుకు కావలసిన పదార్ధాలు:
పులస చేప (మీకు కావాల్సినన్ని ముక్కలు), వెన్న లేదా నూనె, చింతపండు, మెతులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఆవకాయ నూనె, ఉప్పు, మసాలా, కరివేపాకు, కారం, కొత్తిమీర, వెల్లుల్లిపాయ రేకలు, అల్లం, జీలకర్ర, ధనియాలు కలిపి నూరిన ముద్ద.
తయారీ విధానం:
1. మొదటగా పులస చేపని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. వెల్లుల్లిపాయ రేకలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, మెంతులు కలిపి నూరిన ముద్ద సిద్ధం చేసుకోవాలి
3. ఉల్లిపాయను, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఆ తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర వేసి దోరగా వేపాలి. వేగినాక గ్రైడ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను అందులో వేసి వేపాలి.
5. ఒక ఐదు నిమిషాలు అయ్యాక పులస ముక్కలను, ఆవకాయ నూనె, ఉప్పు, కారం వేసి కాసేపు అయ్యాక కొంచెం వాటర్ పోసి కాసేపు ఉడకనివ్వాలి.
6. ఒక పది నిమిషాలు అయ్యాక చింతపండు పులుసు పోసి కలిపి మరికొంత సమయం ఉడకనివ్వాలి.
7. చివరగా స్టౌ మీద నుండి దింపుకొనే ముందుగా కొద్దిగా వేన్న, కరివేపాకు వేస్తే రంగుతో పాటు, రుచి కూడా బాగా వుంటుంది. ఇలా తయారైన పులస పులుసు వేడి వేడిగా అథిదులకు వండించండి. రెండు మూడు రోజుల తర్వాత తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
అయితే పులసని కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ గా ఉంటుంది. కుదరని వాళ్లు గ్యాస్ మీద అయినా చేసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి