Migraine Symptoms: మైగ్రేన్ లక్షణాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

ప్రస్తుతం వయసు తో సంబంధం లేకుండా చాలా మందికి మైగ్రేన్ అనే తలనొప్పి సమస్య వస్తుంది. ఇది సాధారణ తలనొప్పి లాగా అనిపించినా.. చాలా తీవ్రమైన నరాల సమస్య గా మారుతుంది. ముఖ్యంగా ఆడవారిలో మైగ్రేన్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Migraine Symptoms: మైగ్రేన్ లక్షణాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
Headache

Updated on: Jun 24, 2025 | 10:15 PM

మైగ్రేన్ అంటే ఒక దీర్ఘకాలిక నరాల సమస్య అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది తల ఒకవైపు, కొన్నిసార్లు రెండువైపులా కూడా వచ్చే తీవ్రమైన తలనొప్పి. నుదిటి నుంచి మొదలయ్యే ఈ నొప్పి ఒక్కసారిగా తల మొత్తం పాకుతుంది. దీనికి తోడు వికారం, వాంతులు, ఎక్కువ వెలుతురు, శబ్దం, వాసనలు పడకపోవడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి.

మైగ్రేన్‌ కు ముఖ్య కారణాలు.. ఒత్తిడి, సరిగా నిద్రపోకపోవడం, సరైన ఆహారం తినకపోవడం, హార్మోన్ల మార్పులు, వాతావరణ మార్పులు. కొన్నిసార్లు ఎప్పుడూ ఫోన్లు లాంటివి వాడటం కూడా కారణం కావచ్చు. మైగ్రేన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇది మెదడులో రక్త ప్రసరణ మారడం.. నరాల వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల వస్తుంది.

  • తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి
  • కళ్ళకు వెలుతురు పడకపోవడం
  • శబ్దం లేదా వాసనలతో ఇబ్బంది
  • వికారం లేదా వాంతులు
  • 2 గంటల నుంచి 72 గంటల వరకు ఉండే తలనొప్పి

లావెండర్ ఆయిల్ వాసన పీల్చడం.. లావెండర్ నూనె వాసన మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని నేరుగా వాసన పీల్చవచ్చు. లేదా కొబ్బరి నూనెతో కలిపి నుదిటిపై రాసుకోవచ్చు.

అక్యుపంక్చర్ చికిత్స.. ఇది పాత చైనీస్ పద్ధతి. చిన్న సూదులను శరీరంలో ముఖ్యమైన చోట్ల పెట్టి నరాల శక్తిని సమతుల్యం చేస్తుంది. మైగ్రేన్ తగ్గడానికి ఇది సాయపడుతుంది.

అల్లం వాడకం.. అల్లంలో నొప్పి తగ్గించే గుణాలు ఉన్నాయి. అల్లం టీ లేదా కొద్దిగా అల్లం పొడి తాగడం వల్ల నొప్పి నుండి ఉపశమనం దొరుకుతుంది.

యోగా సాధన.. శరీరాన్ని చురుగ్గా ఉంచడమే కాదు.. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగాకు గొప్ప స్థానం ఉంది. ప్రాణాయామం, ధ్యానం లాంటివి మైగ్రేన్‌ ను అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి.

మైగ్రేన్ అనేది చిన్న సమస్య కాదు. దీన్ని పట్టించుకోకపోతే రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది. మైగ్రేన్‌ కు తరచుగా వచ్చే తలనొప్పులు ఒక లక్షణం. కాబట్టి పైన చెప్పిన చిట్కాలు పాటిస్తూ.. అవసరమైతే న్యూరాలజిస్టు లాంటి నిపుణులను కలవడం చాలా అవసరం. మైగ్రేన్‌ ను సరైన సమయానికి గుర్తించి అదుపులోకి తెచ్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)