Signs Of High Cholesterol: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్టే..!
శరీరంలో తక్కువ సాంద్రతలో ఉండే లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) అధిక స్థాయిలో ఉంటేనే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
సాధారణంగా ఎక్కువ లావుగా ఉన్న వారు, అధిక బరువుతో బాధపడేవారికే వివిధ సమస్యలు వస్తాయని మనందరి నమ్మకం. ఒక్కోసారి మనకు ఎదురయ్యే పలు ఘటనలు ఈ నమ్మకాన్ని బలపరుస్తాయి. అయితే వైద్యులు ఈ విషయం కొంతమేర నిజమైనప్పటికీ అన్ని వేళలా ఇది నిజం కాదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రజలు కొవ్వు అంటే చాలా భయపడతారని, కానీ చెడు కొవ్వు, మంచి కొవ్వు అనే రెండు రకాలు ఉంటాయని చాలా మందికి తెలియదని చెబుతున్నారు. శరీరానికి మంచి చేసే కొవ్వును మంచి కొవ్వు అని, ఆర్యోగానికి నష్టం కలింగించే కొవ్వు చెడు కొవ్వు అంటారని పేర్కొంటున్నారు. శరీరంలో తక్కువ సాంద్రతలో ఉండే లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) అధిక స్థాయిలో ఉంటేనే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అయితే ఇది ఎక్కువ బరువు ఉన్న వారికి మాత్రమే వచ్చే సమస్య కాదని తక్కువ బరువు ఉన్నా ఈ సమస్య వస్తుందని హెచ్చరిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్ ధమనుల గోడలపై పేరుకుపోయి, గుండె పోటు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే
పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి
ఈ వ్యాధి ఫలకం ఏర్పడడం వల్ల సంకుచిత ధమనుల వల్ల వస్తుంది. ఇది కాళ్లు, పాదాలతో సహా శరీరంలో దిగువ ప్రాంతాలను రక్త ప్రసరణను నెమ్మదించేలా చేస్తుంది. దీంతో నడిచే సమయంలో కాళ్లు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సరైన చికిత్స తీసుకోపోతే క్రిటికల్ లింబ్ ఇస్కిమియా, ఆక్యూట్ లింబ్ ఇస్కిమియా వంటి తీవ్ర సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.
చేతులు, కాళ్లు తిమ్మిర్లు
సాధారణంగా చేతులు, కాళ్లు తిమ్మిరి సమస్యను చాలా మంది పట్టించుకోరు. అది శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ సూచనగా దీన్ని చూడాలని అంటున్నారు. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ ధమనులను గట్టి పరిచి తద్వారా రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. కాబట్టి కాళ్లు, చేతులకు రక్త ప్రసరణ మందగించి తిమ్మిర్లు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ సమస్యలు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వివిధ రకాల చర్మ సమస్యలకు కారణమవుతుంది. నారింజ లేదా పసుపు రంగు దద్దుర్లు రావడం, కళ్ల మూలల్లో , అరచేతుల్లో గీతల వద్ద కాళ్ల చివర్లో ఈ దద్దర్లు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో తగిన చికిత్స తీసుకోవాలి.
గోళ్ల పెలుసుగా మారడం
మనం ముందుగా పైన పేర్కొన్న విధంగా శరీరంలో చివరి భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇలా సమయంలో గోళ్లు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన రక్త ప్రసరణ లేకపోవడంతో గోళ్లు పెలుసుగా మారి వాటి అంతట అవే ఊడిపోతాయి. ఈ సమస్యతో బాధపడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కొవ్వు సమస్య నుంచి ఎలా బయటపడాలి?
అధిక కొలెస్ట్రాల్ వైద్యులు సైలెంట్ కిల్లర్ అని వైద్యులు చెబుతుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు వచ్చే సంకేతాలు సాధారణంగా ఎవ్వరూ పట్టించుకోరు. ముఖ్యంగా అనారోగ్యంతో సంబంధం లేకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పడు పరీక్షించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు శారీరక శ్రమ, క్రమం తప్పని వ్యాయామం అధిక కొలెస్ట్రాల్ ను దూరంగా ఉంచుతుందని గుర్తుంచుకోవాలి.