
గుండెపోటు ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రభావితం చేస్తున్న తీవ్రమైన వ్యాధి. చాలా సందర్భాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయి. మరికొందరైతే ఉన్నస్థలంలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ అనేవి ఇప్పుడు మనిషికి ప్రాణాంతకంగా మారాయి. అయితే, గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి జాగ్రత్త పడితే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ లాల్ గుండెపోటుతో మరణించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, గుండెపోటుకు ముందు కనిపించిన లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఆయన కొంత ముందుగా ఆస్పత్రికి రాలేకపోయారని, దీంతో తాము ఆయన ప్రాణాలు కాపాడలేకపోయామని వైద్యులు వెల్లడించారు. బిహారీ లాల్‌కు అకస్మాత్తుగా ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. అయితే, ఆయన దాన్ని తేలికగా తీసుకున్నారు. అందుకే ఆయన త్వరగా ఆస్పత్రికి రాలేదు. పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రిలో చేరారని, కొంత సమయానికే ఆయన మరణించారని వైద్య నివేదికలు పేర్కొన్నాయి.
వైద్యుల ప్రకారం.. ప్రతి వ్యక్తికి గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఆ లక్షణాలు 10 నుంచి 15 నిమిషాల ముందుగానే కనిపిస్తాయి. మరికొందరిలో 4-5 గంటల్లో కనిపిస్తాయి. గుండెలోని అడ్డంకులు రక్తం సరిగ్గా పంపింగ్ కాకుండా నిరోధిస్తున్నాయనడానికి ఇదొక హెచ్చరిక సంకేతం. ఈ పంపింగ్ సమస్య వచ్చిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఛాతినొప్పి గుండెపోటుకు ప్రధాన సంకేతం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు.
తీవ్రమైన ఛాతీ నొప్పిని విస్మరించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె ఒత్తిడిలో ఉందని, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఈ నొప్పి సూచిస్తుంది. ఒక వ్యక్తి లక్షణాలను ముందుగానే గుర్తించి ఆసుపత్రికి వెళితే, వైద్యులు CPR ఇవ్వడం ద్వారా లేదా ఆస్ప్రిన్, ఇతర ప్రాణాలను రక్షించే మందులను ఇవ్వడం ద్వారా రోగిని కాపాడతారని వైద్యులు చెబుతున్నారు.
ఛాతిలో భారంగా అనిపించడం
ఛాతి ఎడమవైపున భుజం వరకు నొప్పి
అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం
చలితో చెమటలు
ఎడమ చేయి, దవడలో నొప్పి
వీరికి ప్రమాదం ఎక్కువ
ఇప్పటికే అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు అత్యధిక ప్రమాదంలో ఉంటారని గుర్తించాలి.
వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయాలి
మీరు ఒంటరిగా కారులో ఆస్పత్రికి వెళ్లవద్దు
ఇతరుల సహాయంతో ఆస్పత్రికి వెళ్లండి
విశ్రాంతిగా కూర్చోండి లేదా పడుకోండి
మీ దగ్గర ఆస్పత్రిన్ లాంటి మందులు ఉంటే తీసుకోండి.