Juices Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుంటారు. అయితే.. పరగడుపున కొన్ని జ్యూస్‌లు తాగితే.. ఆరోగ్యంగా ఉండొచ్చని, ఇక ఆసుపత్రికి వెళ్లాల్సిన పనే ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జ్యూస్‌లలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, ఖనిజాలు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుంచి బయటపడటానికి ఇవి సహాయపడతాయి. అందుకే జ్యూస్‌లను తాగాలని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో ఎలాంటి రసాలను తీసుకుంటే మంచిదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
దానిమ్మ రసంః ఖాళీ కడుపుతో దానిమ్మ రసం తాగడం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. ఈ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రూచికరంగా ఉండే దానిమ్మ రసం రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మంచిది.
ఉసిరి జ్యూస్ః ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, విటమిన్ సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మలబద్ధకం సమస్యను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.
సొరకాయ రసంః సొరకాయ రసంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇంకా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సొరకాయ రసం గుండె ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది. అందుకే మీ బరువు తగ్గించే డైట్‌లో సొరకాయ రసాన్ని చేర్చుకుంటే మంచిది.
అలోవెరా జ్యూస్ః కలబందలో విటమిన్ సి, ఎ, విటమిన్ బి3 ఉంటాయి. ఇందులో కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల పొట్టలోని వేడి తగ్గుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..