Health care Tips: శరీరంలో నీటి స్థాయులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. లేకపోతే శరీరంతో పాటు చర్మానికి పలు సమస్యలు తప్పవు. తక్కువగా నీరు తాగే వారికి మలబద్ధకంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలాగే చర్మం మెరుపును కోల్పోతుంది. అలాగే జుట్టు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలా నీరు తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొందరు అదే పనిగా నీరు తాగుతూ ఉంటారు. ఇది పలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా అతిగా దాహం వేయడం కూడా శరీరానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు కొన్ని వ్యాధులు లేదా సమస్యలకు సంకేతాలంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
మధుమేహం
ఈ వ్యాధి అంత త్వరగా బయటపడదు. దురదృష్టవశాత్తూ చాపకింద నీరులా మన దేశంలో మధుమేహం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక దాహానికి దారి తీస్తుంది. తరచూ మూత్రవిసర్జనకు వెళుతుంటారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయులు క్షీణించినప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఎక్కువ దాహం వేస్తున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకోవాలి.
గర్భం కారణంగా
గర్భిణీలు ఆరోగ్య పరంగా పలు మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో అధిక దాహం కూడా ఒకటి. గర్భదారణ సమయంలో మహిలలు ఎక్కువగా నీరు తాగుతుంటారు. తరచూ మూత్ర విసర్జనకు వెళుతుంటారు. గర్భధారణ సమయంలో ఇలా జరగడం సహజం. అయితే అధిక దాహంతో బాధపడే మహిళలు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
డీహైడ్రేషన్..
డీహైడ్రేషన్‌తో బాధపడే వారికి కూడా విపరీతమైన దాహం కలుగుతుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడితే దాహం ఎక్కువగా వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వేసవిలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, వర్షాకాలంలో లేదా శీతాకాలంలో కూడా దీనిని ఎదుర్కోవలసి ఉంటుంది. డీహైడ్రేషన్ ప్రభావం చర్మం, జుట్టు మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.