
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులను బాధిస్తున్న అల్జీమర్స్ వ్యాధి పురోగతిని నివారించడంలో, సాధారణ శారీరక శ్రమ అద్భుతంగా పనిచేస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ మెడిసిన్ పత్రిక ప్రచురించింది.
అల్జీమర్స్‌కు అధిక ప్రమాదం ఉన్న వృద్ధులలో కూడా, సాధారణ నడక వ్యాధి పురోగతిని గణనీయంగా నెమ్మదింపజేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు కేవలం 3,000 నుండి 5,000 అడుగులు నడిచిన వారిలో జ్ఞానపరమైన క్షీణత మూడు సంవత్సరాలు ఆలస్యమైంది. అదే 5,000 నుండి 7,500 అడుగులు నడిచిన వారిలో ఏకంగా ఏడు సంవత్సరాల వరకు ఆలస్యం అయింది.
మరోవైపు, నిశ్చల జీవనం గడిపిన వారిలో మెదడులో టౌ ప్రొటీన్లు వేగంగా పేరుకుపోయాయి. దీంతో వారిలో జ్ఞాపకశక్తి, దైనందిన కార్యకలాపాల సామర్థ్యం త్వరగా తగ్గినట్లు గమనించారు. ఈ పరిశోధన హార్వర్డ్ ఏజింగ్ బ్రెయిన్ స్టడీ డేటా ఆధారంగా జరిగింది.
అల్జీమర్స్ వ్యాధితో ముడిపడి ఉన్న అమిలాయిడ్-బీటా ప్రొటీన్ స్థాయిలు అధికంగా ఉన్నవారిలో, ఎక్కువ అడుగులు వేయడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణత నెమ్మదించింది. శారీరక శ్రమ వల్ల కలిగే ఈ ప్రయోజనాలు ప్రధానంగా మెదడులో టౌ ప్రొటీన్ పేరుకుపోవడం నెమ్మదించడం వల్లే సంభవించినట్లు పరిశోధకులు గుర్తించారు.
“కొంతమందిలో అల్జీమర్స్ లక్షణాలు ఉన్నా, క్షీణత ఎందుకు త్వరగా జరగదనే దానిపై ఈ పరిశోధన వెలుగునిచ్చింది. జీవనశైలి మార్పుల ప్రభావం వ్యాధి ప్రారంభ దశలోనే పనిచేస్తుంది. మనం త్వరగా మేల్కొంటే, లక్షణాలను నెమ్మదింపజేయవచ్చు” అని సీనియర్ రచయిత డాక్టర్ జస్మీర్ ఛత్వాల్ తెలిపారు.
“ప్రతి అడుగు విలువైనదే. రోజువారీ కార్యకలాపాలను కొద్దిగా పెంచుకున్నా, కాలక్రమేణా అలవాట్లుగా మారి ఆరోగ్యంలో స్థిరమైన మార్పులు సృష్టిస్తాయి. ప్రజలు చురుకుగా ఉంటూ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి” అని పరిశోధకులు ఉద్ఘాటించారు.