మీరు గంటలకొద్దీ కదలకుండా కూర్చుంటున్నారా? అయితే లివర్ షెడ్డుకే..
ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారని తేలింది. కూర్చొని పని చేయడం, షుగర్‌తో కూడిన పానీయాలు, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారణాలు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ బరువును నియంత్రించడం ద్వారా దీనిని నివారించవచ్చు.

ఆధునిక జీవనశైలి, ముఖ్యంగా ఆఫీసు పనిలో గంటల కొద్దీ కదలకుండా కూర్చొనే విధానం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. గతంలో జరిగిన అధ్యయనాలు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల ఉబకాయం, వెన్నునొప్పి, నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని వెల్లడించాయి. అయితే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధకులు గతంలో నిర్వహించిన అధ్యయనం మరింత ఆందోళనకరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల ఫ్యాటీ లివర్ బారినపడే ప్రమాదం ఉందని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువ గంటలు కూర్చొనే పనిచేస్తుండటంతో వారిలో ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా ఉన్నట్లు తేలింది.
అధ్యయనం వివరాలు:
అప్పటి హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్లు కల్యాణ్ కర్ మహదేవ్, సిట్టి అనిత, రీసెర్చ్ స్కాలర్స్ భారం భార్గవ, నందిత ప్రమోద్ బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వీరికి ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీనియర్ హెపటాలజిస్ట్ డాక్టర్ పీఎన్ రావు సహకారం అందించారు. మొత్తం 758 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో 345 మంది జీవక్రియలపై విశ్లేషణ చేశారు. 2023 జులై నుంచి 2024 జూన్ వరకు ఏడాదిపాటు జరిగిన ఈ పరిశీలనలో భాగంగా, ఎంపిక చేసిన ఉద్యోగులకు నాలుగు దఫాలుగా మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 84 శాతం మంది ఐటీ ఉద్యోగులు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD) లేదా సాధారణంగా ఫ్యాటీ లివర్ అని పిలిచే సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. దిల్లీలోని ఎయిమ్స్ 2022 సర్వే ప్రకారం దేశంలో 38 శాతం మంది ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాలేయంలో సాధారణంగా చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. 5 శాతానికి మించి కొవ్వు చేరితే దానిని ఫ్యాటీ లివర్‌గా పరిగణిస్తారు. అధిక ఆల్కహాల్ సేవనం, అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు అందుతాయి. ఖర్చు కాని క్యాలరీలు కొవ్వుగా మారి కాలేయ కణాల్లో పేరుకుపోతాయి. డాక్టర్ పీఎన్ రావు ప్రకారం, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, షుగర్‌తో కూడిన పానీయాలు (కూల్ డ్రింక్స్, సోడా వంటివి) తాగడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, అస్తవ్యస్తమైన పనివేళలు ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు.
తీవ్రమైన పరిణామాలు
ఫ్యాటీ లివర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, నియంత్రించకపోతే లివర్ సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని హెచ్‌సీయూ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధ్యయనంలో సర్వే చేసిన వారిలో 71 శాతం మంది ఊబకాయంతో, 34 శాతం మంది జీవక్రియలో ఇబ్బందులతో ఉన్నట్లు ప్రొఫెసర్ మహదేవ్ పేర్కొన్నారు. జీవక్రియ సమస్యలు ఫ్యాటీ లివర్, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు (హై బీపీ) వంటి రుగ్మతలకు కారణమవుతాయి. ఈ అధ్యయన ఫలితాలు నేచర్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలోని “సైంటిఫిక్ రిపోర్ట్” జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
నివారణ, జాగ్రత్తలు
డాక్టర్లు చెబుతున్న వివరాల ప్రకారం.. ప్రస్తుతం తమ వద్దకు వచ్చే రోగులలో ప్రతి పది మందిలో ఆరుగురు ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఇది జన్యుపరమైన మార్పులకు దారితీసి జీవనశైలి వ్యాధులకు కారణమవుతుందని ఆయన చెప్పారు. ఫ్యాటీ లివర్ కారణంగా ఇతర శారీరక రుగ్మతలు కూడా తలెత్తే అవకాశం ఉందని, దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువసేపు కూర్చొని పనిచేయాల్సి వచ్చినప్పుడు ప్రతి గంటకు ఒకసారి లేచి కొన్ని నిమిషాలపాటు శరీరాన్ని సాగదీయడం, నడవడం వంటివి చేయాలి.
వీలైతే స్టాండింగ్ డెస్క్‌లను ఉపయోగించడం మంచిది.
జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, సోడా వంటి షుగర్ పానీయాలకు దూరంగా ఉండాలి.
తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
రోజువారీ వ్యాయామంతో పాటు, పని మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం.
రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకుంటూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఫ్యాటీ లివర్ మరియు దాని సంబంధిత ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
