Health: మనసారా నవ్వుకుందాం డ్యూడ్.. పోయేదేముంది.. మహా అయితే ఒత్తిడి తప్ప

|

Jul 07, 2022 | 6:53 AM

మనసారా నవ్వడం (Smile) ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చని పెద్దలు చెబుతుంటారు. అది నిజం కూడానూ. అందుకే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వక పోవడం ఒక రోగం అన్న సామేత ఊరికే రాలేదు. ప్రస్తుత....

Health: మనసారా నవ్వుకుందాం డ్యూడ్.. పోయేదేముంది.. మహా అయితే ఒత్తిడి తప్ప
Laughing Health
Follow us on

మనసారా నవ్వడం (Smile) ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చని పెద్దలు చెబుతుంటారు. అది నిజం కూడానూ. అందుకే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వక పోవడం ఒక రోగం అన్న సామేత ఊరికే రాలేదు. ప్రస్తుత సమాజంలో అలసట, ఒత్తిడి, కోపం, ఆందోళన (Concern) వంటివి నిండిపోయాయి. వీటిని దాటి మనసారా నవ్వడమే ఒక భాగ్యమైపోయింది. మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా చెప్పలేం. కానీ నవ్వు మన ప్రాణానికి ఎంతో మంచిది. పెదాలపై చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. రోజంతా పని చేసి ఒత్తిడిగా ఉండటం సహజమే. కానీ ఒకసారి వీలు కల్పించుకుని మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో మాట్లాడండి. వారితో జోక్స్ చెప్పండి. అంతే మీ ముఖంపై నవ్వు ఆటోమెటిక్ గా వచ్చేస్తుంది. ఒత్తిడంతా మటుమాయమవుతుంది. పని చేసే సమయంలోనూ కొన్ని నిమిషాలు మీ ఫ్రెండ్స్ తో ముచ్చటించండి. మీ అభిప్రాయాలను వారితో పంచుకోండి. వారి సూచనలను పరిగణలోకి తీసుకోండి. అలా చేయడం వల్ల నెగిటివ్ వైబ్స్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.

కొద్ది సేపు నవ్వడం వల్ల శారీరక ఒత్తిడి తగ్గిపోతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆక్సిజన్ శోషణకు నవ్వు ఎంతనాగో సహాయపడుతుంది. చిన్న నవ్వు నవ్వడం ద్వారా శరీరంలోని కండరాలు, గుండె, ఊపిరితిత్తులు నూతనోత్సాహాన్ని నింపుకుంటాయి. ఒంటి నొప్పులను తగ్గించే ఎండార్పిన్ లెవెల్స్ ను పెంచడంలో నవ్వు సహాయపడుతుంది. కొన్ని నిమిషాల పాటు మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోతాయి. దీంతో బాడీ రిలాక్స్ అవుతుంది. నవ్వు రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. నవ్వుతో న్యూరోపెప్టైడ్లు విడుదల అవుతాయి. ఇవి వివిధ అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది. సో.. ఒక నవ్వు నవ్వితే పోయేదేముంది.. ఒత్తిడి తప్ప.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు పాఠకుల అభిప్రాయం కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.