రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టడం లేదా ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి సమస్యలు ఎదురైతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి మన శరీరం ఏదైనా వ్యాధిని ముందుగానే పసిగట్టే సామర్ధ్యం కలిగి ఉంటుంది. దాని గురించి ముందుగానే కొన్ని హెచ్చరికలు చేయడం ప్రారంభిస్తుంది. దాని సంకేతాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే, సమస్య నుంచి బయటపడొచ్చు. అలాంటి సంకేతం రాత్రిళ్లు చెమటలు, వేగంగా బరువు తగ్గడం. ఇలా కొన్నిసార్లు జరగడం సాధారణం. కానీ అలాంటి సమస్య తరచుగా సంభవిస్తే, మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి లింఫోమా సంకేతాలు కావచ్చు. ఇది క్యాన్సర్ రకం.
వాతావరణం సాధారణంగా ఉన్నప్పుడు కూడా కొందరు రాత్రిళ్లు చెమటతో తడిసి పోయి మేల్కొంటారు. చలి ప్రాంతాల్లో నివసించే వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. విపరీతంగా రాత్రి చెమటలు రావడం అలసిపోయిన సందర్భాల్లో కూడా జరుగుతుంది. తరచూ ఇలా జరుగుతున్నట్లయితే విస్మరించడం ప్రమాదకరం. ఎందుకంటే ఇది లింఫోమా క్యాన్సర్ కావచ్చు. ఇది లింఫోసైట్లు, అంటే ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేస్తుంది.
మన శరీరంలో శోషరస వ్యవస్థ ఉంది. ఇందులో శోషరస కణుపులు, ప్లీహము, థైమస్, ఎముక మజ్జ ఉంటాయి. ఇక్కడ వివిధ రక్తకణాలు ఏర్పడతాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ఈ కారకాలు చాలా ముఖ్యమైనవి. వీటికి సంబంధించిన క్యాన్సర్లలో దేనినైనా లింఫోమా అంటారు.
లింఫోమా ఎందుకు సంభవిస్తుందో చెప్పడానికి ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే లింఫోసైట్లు అని పిలువబడే కొన్ని కణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. ఇవి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లింఫోసైట్ అభివృద్ధికి సంబంధించి వివిధ దశలలో సంభవించే జన్యు మార్పుల కారణంగా ఉత్పరివర్తనలు సంభవిస్తాయి.