Late Night Food: రాత్రుళ్లు స్నాక్స్‌తో పాటు భోజనం ఎక్కువగా తింటున్నారా.? మీ కొంప మునిగినట్లే..

ఈ మధ్యకాలంలో లేట్ నైట్ డిన్నర్స్, అర్ధరాత్రి వేళ టిఫిన్లు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇలాంటి అలవాట్లు..

Late Night Food: రాత్రుళ్లు స్నాక్స్‌తో పాటు భోజనం ఎక్కువగా తింటున్నారా.? మీ కొంప మునిగినట్లే..
Eating Late At Night Side Effects

Updated on: Oct 11, 2022 | 4:35 PM

ఒడిదుడుకుల జీవితంలో ఎప్పుడు తింటున్నామో.. ఏ టైంకి పడుకుంటున్నామో.. ఎవ్వరికీ తెలియట్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో లేట్ నైట్ డిన్నర్స్, అర్ధరాత్రి వేళ టిఫిన్లు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇలాంటి అలవాట్లు మీ ఆరోగ్యం కొంపముంచుతాయి జాగ్రత్త అని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఊబకాయం, ఒబేసిటీ లాంటి సమస్యలు తలెత్తవచ్చునని చెబుతున్నారు. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పలువురు నిపుణులు తాజాగా రాత్రిపూట అధికంగా తినేవారిపై ఓ అధ్యయనం చేపట్టారు. రాత్రుళ్లు అధికంగా తినడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. రాత్రుళ్లు అధికంగా తింటే.. బరువు ఎందుకు పెరుగుతారన్న దానిపై కూడా వారు ఇలా వివరించారు.

సిర్కాడియన్ రిధమ్:

వినడానికి ఈ పేరు కొత్తగా ఉన్నా.. వైద్యశాస్త్రంలో దీనిని స్లీప్-వేక్ సైకిల్ అని అంటారు. మనం ప్రతీ రోజూ పాటించే దినచర్య సక్రమంగా ఉంటే.. సిర్కాడియన్ రిధమ్‌ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అయితే ఒకవేళ మన దినచర్యలో ఏవైనా మార్పులు జరిగితే మాత్రం సిర్కాడియన్ రిధమ్‌కు భంగం కలుగుతుంది. ఫలితంగా లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అధికంగా తినడం:

రాత్రుళ్లు ఆకలి వేస్తోందని.. చాలామంది ఏదొకటి తింటుంటారు. అయితే ఇలా అర్ధరాత్రి వేళ అధికంగా తింటే.. మన శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయి. ఫలితంగా నిద్రకు భంగం వాటిల్లడంతో.. తిన్న ఫుడ్ తొందరగా జీర్ణం అవ్వదు. దీంతో బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.

ఫాస్ట్ ఫుడ్:

చాలామంది రాత్రిపూట స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్‌ను తింటుంటారు. వీటిని రాత్రిపూట అస్సలు తినకూడదు. ఇవే కాదు మసాలా నిండిన ఆహార పదార్ధాలు లాంటివి తిన్నా తొందరగా జీర్ణం కావు. ఇక రాత్రుళ్లు ఎక్కువగా తిన్నట్లయితే.. మీ నిద్రకు ఆటంకం కూడా ఏర్పడవచ్చు.

జీర్ణక్రియ సరిగ్గా ఉండకపోవడం:

సాధారణంగా రాత్రుళ్లు జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. ఈ సమయంలో మీరు అధికంగా తింటే.. కడుపులో నొప్పి, ఛాతీలో మంట, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రాత్రిపూట ఆహారం తినే అలవాటు మెటబాలిక్ సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.