ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ.. వంటింట్లో ఏదొక పని ఉంటూనే ఉంటుంది. ఉదయాన్నే టీ – కాఫీలతో మొదలయ్యే వంటింటి పని.. రాత్రి భోజనాల తర్వాత కూడా పూర్తవ్వదు. మరుసటిరోజు చేసుకోవచ్చని అలసటతో పడుకుంటాం. కొన్ని చిట్కాలను తెలుసుకుంటే.. మనం రోజూ చేసే పనుల్లో కొన్ని ఈజీగా పూర్తిచేసేయొచ్చు. మరి ఆ వంటింటి చిట్కాలేంటో తెలుసుకుందామా ?
పెరుగు రుచిగా ఉండాలంటే: పెరుగు రుచిగా.. గట్టిగా తోడుకోవాలంటే.. తోడువేసే ముందు గిన్నెను పటిక ముక్కతో రుద్దండి. అలాగే పెరుగు పుల్లగా ఉండకుండా ఉండాలంటే.. తోడువేసేటపుడే అందులో ఒక చిన్న కొబ్బరిముక్క వేయండి.
వెల్లుల్లి పొట్టు ఈజీగా: వెల్లుల్లి రెబ్బలకు ఉన్న పొట్టును సులువుగా తీయాలంటే వాటిలో 3-4 చుక్కల నూనె వేసి కలిపి, 5 నిమిషాల తర్వాత తీయండి.
దోసెలు బాగా రావాలంటే: దోసెలు వేసేటపుడు.. ఒక్కోసారి దోసెపిండి పెనంకు అతుక్కుపోయి.. దోసెలు చిరిగిపోతుంటాయి. అలా చిరగకుండా దోసెలు పలుచగా రావాలంటే.. దోసెల పిండి గ్రైండ్ చేసేటపుడే ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బుకోవాలి. దోసె వేసే ముందు పెనంపై వంకాయ ముక్కతో రుద్దినా దోసెలు అతుక్కుపోకుండా వస్తాయి.
కేక్ టిప్: కేక్ తయారు చేసేటపుడు ఆ బ్యాటర్ లో ఒక స్పూన్ గ్లిసరిన్ కలిపితే ఎక్కువ కాలం కేక్ తాజాగా ఉంటుంది.
కోడిగుడ్ల టిప్: కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టనివారు.. వాటిపై ఆముదం రాస్తే త్వరగా కుళ్లకుండా ఉంటాయి. గుడ్డుకి నిమ్మరసం రాసి ఉంచితే.. పగుళ్లు రాకుండా ఉంటాయి.
రైస్ గడ్డలు అవ్వకుండా: బిర్యానీ, పులావ్, బగారా వంటివి వండేటపుడు అందులో ఒక నిమ్మకాయ రసం పిండితే.. రైస్ గడ్డలు అవ్వకుండా పొడిపొడిగా ఉంటుంది.
బియ్యాన్ని వేయించాలి: అన్నం తిన్నాక తేలికగా జీర్ణం అవ్వాలంటే.. వండే ముందు బియ్యాన్ని వేయించి వండుకోవాలి.
టమోటాలు ఫ్రెష్ గా: టమోటాలు వాడిపోతే.. ఉప్పు కలిపిన నీటిలో ఒక రాత్రంతా ఉంచాలి. ఉదయానికల్లా తాజాగా కనిపిస్తాయి.
పూరీలు స్మూత్ గా: పూరీగా మెత్తగా.. బాగా పొంగుతూ రావాలంటే గోధుమపిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్యంపిండి కలపాలి. అలాగే పిండి కలిపేటపుడు నీళ్లకు బదులు పాలను వాడి చూడండి.
ఫ్రిడ్జ్ మెరవాలంటే: ఫ్రిడ్జ్ బయటి భాగాన్ని వెనిగర్ తో తుడిస్తే.. కొత్తదానిలా మెరుస్తుంది. ఫ్రిడ్జ్ లోపలి భాగాన్ని శుభ్రం చేసేందుకు బై కార్బొనేట్ సోడా వాటర్ ను వాడితే.. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి