Dogs Sniffing Corona : ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో శునకాలు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను పసిగడుతున్నాయని తేలింది. దీంతో వాటికి శిక్షణ ఇస్తే మరింత రాటుదేలుతాయని చెబుతున్నారు. పూర్వకాలం నుంచి శునకాలు మానవులకు పెంపుడు జంతువులుగా ఉంటున్నాయి. వాటికి విశ్వాసంతో పాటు గ్రాహక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పోలీస్ శాఖలో వీటిని భాగం చేశారు. నేరస్థులను, ఫోరెన్సిక్ ఆధారాలను, మాదక ద్రవ్యాలను, ఉగ్రవాదులు పెట్టే పేలుడు పదార్థాలను ఇట్టే గుర్తిస్తాయి. ఇప్పుడు కరోనాను కూడా గుర్తుపడుతున్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష (ర్యాట్) కంటే మెరుగ్గా.. 97 శాతం కచ్చితత్వంతో శునకాలు పాజిటివ్‌లను గుర్తిస్తాయని వారు వెల్లడించారు. కొవిడ్ నుంచి కోలుకుని నెగటివ్ వచ్చిన వారిని 91 శాతం కచ్చితత్వంతో గుర్తించాయని పేర్కొన్నారు. అంతేకాదు.. శునకాలు సెకన్ల వ్యవధిలో ఫలితాన్ని తేల్చేస్తాయని వివరించారు. రద్దీగా రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో శునకాల ద్వారా కరోనా సోకిన వారిని సులభంగా గుర్తుపట్టవచ్చంటున్నారు.
పారిస్‌లోని నేషనల్ వెటర్నరీ స్కూల్‌లో కరోనాను గుర్తించడంలో శునకాలకు తర్ఫీదునిచ్చామని, మార్చి-ఏప్రిల్ నెలల్లో 335 మంది వలంటీర్లపై ఈ పరిశోధనలు చేశామని, వారిలో 109 మందికి పీసీఆర్‌లో పాజిటివ్ వచ్చిందని, వారందరి నమూనాలను శునకాలు క్షణాల్లో పాజిటివ్‌గా గుర్తించాయని వివరించారు. ప్రస్తుతం ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, దుబాయ్‌ల్లో కూడా శునకాలకు శిక్షణనిస్తున్నారు. కరోనా టెస్ట్‌ల కంటే ఈ ప్రాసెస్ చాలా సులువుగా, తొందరగా ఉంది కనుక ప్రపంచ దేశాలు ఇప్పుడు శునకాలకు తర్పీదునిచ్చే అంశం గురించి చర్చిస్తున్నారు.