Osmania Hospital: ఉస్మానియా హాస్పిటల్‌లో అరుదైన శస్త్ర చికిత్స.. ఇదే దేశంలో తొలిసారి..
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. భారతదేశం చరిత్రలోనే తొలి సారి చిన్న ప్రేగు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేసి 40 ఏళ్ల రోగికి ప్రాణం పోశారు. దీంతో భారతదేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ ఆసుపత్రులలో మొదటి సారిగా చిన్న ప్రేగు మార్పిడి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లుగా ఉస్మానియా వైద్యులు నిలిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌తో సహా మరే ప్రభుత్వ దవాఖానాల్లో ఇప్పటివరకు సాధ్యం కాని చిన్నపేగు మార్పిడి ప్రక్రియను మన ఉస్మానియా డాక్టర్లు చేసి చూపారు.

40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తికి చిన్న పేగు పూర్తిగా పాడవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స చేసి పాడపోయిన చిన్న ప్రేగును తొలగించారు. దీంతో బాధితుడు ఏమీ తినలేక, తాగలేక ఐవీ ప్లూయిడ్లతో మాత్రమే కాలం గడుపుతున్నాడు. దీంతో శరీరాని సరైన పోషకాలు అంతక పోవడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షిణించింది. అయితే చిన్న పేగు మార్పిడి(ఇంటెస్టైన్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేస్తే రోగి బతికే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో.. బాధిత కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. అక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ మధుసూదన్‌ను సంప్రదించారు.
అయితే ఈ ఇంటెస్టైన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ క్లిష్టతరమైందని ఆయన బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. అయినా తాము శస్త్ర చికిత్స చేస్తామని వాళ్లకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి చిన్నపేగును భద్రంగా తొలగించిన వైద్య బృందం.. సుమారు 12 గంటల పాటు శ్రమించి దానిని విజయవంతంగా బాధితుడికి అమర్చారు. ఈ శస్త్ర చికిత్సను ఈ నెల 19వ తేదీన విజయవంతంగా పూర్తి చేశారు.ప్రస్తుతం బాధితుడిని ఆపరేషన్ థియేటర్లోనే ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా ఫ్లూయిడ్స్ వంటికి అందించడంతో బాధితుడు నెమ్మదిగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు ఆరు కేసుల్లో మాత్రమే చిన్న పేగు మార్పిడి సర్జరీలు జరిగాయని, దేశం మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉస్మానియాలోనే ఈ చికిత్సను మొదటిసారి విజయవంతంగా చేసినట్లు వైద్య బృందం వెల్లడించింది.




