సాధారణంగా మనలో ఉపవాసాలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మన ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, భార్య, అక్క ఇలా.. అందరూ వారంలో ఏదొక రోజు దైవం పేరు చెప్పి ఉపవాసం చేస్తుంటారు. కొందరైతే ఒక్కపూట ఉపవాసం ఉంటారు. అలా చేయడం తప్పేం కాదు. అయితే ఉపవాసాలు చేసేవారిలో ఆడవారే ఎక్కువగా ఉంటుంటారు. ఉపవాసం ఉంటే నీరసించిపోతారన్న విషయం తెలిసిందే. అందుకే పూర్తిగా ఉపవాసం కాకుండా పాలో, పండ్లో తీసుకుంటారు. మరి ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మంచిదేనా అంటే.. మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండటం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
-వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండటం వల్ల మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
-మనం తీసుకునే ఆహారం గ్లూకోజ్ గా మారి శరీరానికి శక్తినిచ్చేందుకు సుమారు 4 గంటల సమయం పడుతుంది. అదే ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది.
-ఉపవాసం ఉన్న సమయంలో.. రోజుకి 2-3 లీటర్ల నీరు తాగితే ఛాతీలో మంట తగ్గడంతో పాటు.. మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
-పెప్టిక్ అల్సర్లు, మధుమేహం ఉన్నవారు ఉపవాసం ఉంటే మధ్య మధ్యలో పళ్లు, కూరగాయలు తినొచ్చు.
-వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే.. శరీరం కూడా తేలికపడుతుంది. వారమంతా యాక్టివ్ గా పనిచేస్తారు.
-ఉపవాసాన్ని ముగించే సమయంలో ఫ్రైడ్, జంక్ ఫుడ్, నూనెతో చేసినవి, తీపి పదార్థాలు, అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. అలా చేస్తే ఉపవాసం చేసిన ఫలితం ఉండదు.
-ఉపవాసం పూర్తయ్యాక తేలికగా జీర్ణమయ్యే ఆహారం.. అంటే ఉడికించిన కూరగాయలు, పాలు, పెరుగు లేదా ఉడికించిన గింజలు, మొలకెత్తిన విత్తనాలు వంటి వాటిని తినాలి.
-బీపీ, బక్కపలుచగా ఉన్నవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, బాలింతలు ఉపవాసం ఉండకపోవడం మేలు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..