Breastfeeding: తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు అందించడం వల్ల ఎంతో మంచిదనే విషయం అందరికి తెలిసిందే. అయితే బిడ్డకు పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుంబంధం ఏర్పడుతుంది. అందుకే బిడ్డ పుట్టిన నాటి నుంచి 6 నెలల వయసు వరకు, అవసరాన్ని బట్టి ఏడాది వరకు తల్లిపాలే తాగించాలని వైద్యులు సూచిస్తుంటారు. తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ సమపాళ్లలో ఉండడం వల్ల బిడ్డ శారీరక, మానసిక వికాసం వేగంగా వృద్ధి చెందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ.. ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్, శారీరక సౌందర్యం, రకరకాల కారణాల వల్ల బిడ్డకు తల్లిపాలు అందడం లేదు. డబ్బా, పౌడర్ పాలే అలవాటు చేస్తున్నారు.
కాగా, తల్లిపాలు కాకుండా డబ్బా పాలు, పౌడర్ పాలు పట్టడం వల్ల శిశువు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే దాదాపు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలే ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని ప్రప్రపం ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం సూచిస్తోంది.
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో మొదటగా వచ్చేవి ముర్రుపాలు. ఈ పాలు బిడ్డకు ఎంతో మంచిది. ఇందులో ఎంతో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి బిడ్డలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంటుంది. ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడంతో అతిశయోక్తి లేదు. ఈ పాల ద్వారా పసికందులో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుట్టిన బిడ్డకు ఆరు నెలలపాటు కచ్చితంగా ప్రతిరోజూ 12 సార్లు తల్లిపాలు తాగించాలంటున్నారు వైద్య నిపుణులు. పాలిచ్చే తల్లి అధికంగా నీరు తాగడం ఎంతో మంచిది. ఫలితంగా పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి.
తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి. చెవిలో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అస్తమా, మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడటమే కాకుండా.. చిన్నపేగు, పెద్ద పేగుల సంబంధిత వ్యాధులు (గ్యాస్ట్రో నింటెస్టినల్ రిఫ్లెక్స్) రాకుండా నివారిస్తాయి. అంతేకాదు.. మెదడుపై పొరల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడగలుగుతాం. కీళ్ల సంబంధిత వ్యాధులు, తెల్లరక్త కణాల సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. తల్లిపాలు తాగిన వారికి డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్య పరిశోధనలలో తేలింది. గుండె పనితీరు, రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తే అవకాశం తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు పరిశోధనల ద్వారా తేల్చారు. అలాగే ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందట.
ఆవు, గేదె పాలకంటే తల్లిపాలలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఆవు పాలలో కేసిన్ అనే ప్రొటీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఈ ప్రొటీన్ కడుపులోకి వెళ్లాక ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. దీంతో ఆహారం జీర్ణం కావడం కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అదే తల్లిపాలలో ఈ ప్రొటీన్ తగినంత పరిమాణంలో ఉండడం వల్ల శిశువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం జీర్ణమవుతుంది. తల్లిపాలలో లాక్టోజ్ పరిమాణం(ఎల్/7జీ) ఉండగా, ఆవు పాలలో (ఎల్/48జీ)గా ఉంటుంది. నాడీ వ్యవస్థ పనితీరులో అత్యంత కీలకపాత్ర పోషించే లాక్టోజ్ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల తల్లిపాలు తాగే శిశువులు చురుగ్గా ఉంటారు. తల్లి పాలలో ఐరన్ 50 శాతం ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ అంశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది.