Dengue Fever: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో డెంగ్యూ వ్యాధి విపరీతంగా ప్రబలుతోంది. విశాఖ మన్యంతోపాటు చిత్తూరు జిల్లాలోనూ డెంగ్యూ భయపెడుతోంది. చిత్తూరు జిల్లాలో మహమ్మారి ధాటికి గ్రామాలకు గ్రామాలే మంచాన పడుతున్నాయి. తిరుపతి రుయా ఆస్పత్రి డెంగ్యూ రోగులతో నిండిపోతోంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు… కడప, అనంతపురం జిల్లాలోనూ విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అయితే, డెంగ్యూ ఫీవర్స్ కు పారిశుద్ధ్య నిర్వహణా లోపమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అటు, విశాఖ మన్యాన్ని డెంగ్యూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏజెన్సీలో డెంగ్యూ రోగులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. 11 మండలాల్లో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క విశాఖ నగరంలోనే 30కి పైగా డెంగ్యూ కేసులు నమోదు కావడంతో తీవ్రతకు అద్దంపడుతోంది. ఎక్కువమంది ఫీవర్, బ్లడ్ బీడింగ్, బాడీ పెయిన్స్, ప్లేట్ లెట్స్ డౌన్ తో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
అయితే, కోవిడ్ జ్వరమా? లేక డెంగ్యూ ఫీవరా? అనేది తెలియకపోవడంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. కరోనా, డెంగ్యూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉండటంతో రోగులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్థానిక బీజేపీ నేత లోకుల గాంధీ ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూతో పలువురు మృత్యువాత పడుతుండటంతో అడవి బిడ్డల్లో ఆందోళన మొదలైంది. డెంగ్యూ రోగుల కోసం విశాఖ కేజీహెచ్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.