Cyber Sickness: సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే తల తిరుగుతోందా? తస్మాత్ జాగ్రత్త!

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత దాంతోనే సమయం గడిపేస్తుంటాం. సోషల్ మీడియా ఓపెన్ చేశామంటే ఇక టైమే తెలీదు. నిమిషాలు, గంటలు, రోజులు ఇట్టే గడిచిపోతాయి. కొత్తలో బాగానే ఉన్నా కొన్నాళ్లకు దానికి బానిసగా మారిపోతారు. సోషల్ మీడియా చూడకుండా ఉండలేరు.

Cyber Sickness: సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే తల తిరుగుతోందా? తస్మాత్ జాగ్రత్త!
Cyber Sicknesss

Updated on: Jan 09, 2026 | 6:30 AM

మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు కార్లో లేదా బస్సులో కలిగే ‘మోషన్ సిక్‌నెస్’ గురించి అందరికీ తెలుసు. కానీ ఇంట్లో ఒకే చోట కూర్చుని మొబైల్ చూస్తున్నప్పుడు కూడా అదే తరహా అనారోగ్యం కలగడమే ఈ సైబర్ సిక్‌నెస్. ముఖ్యంగా వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్లు వాడేవారిలో, అతిగా సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉంది.

సెన్సరీ కాన్‌ఫ్లిక్ట్ థియరీ అంటే..

మనం స్క్రీన్ మీద వేగంగా కదులుతున్న దృశ్యాలను చూస్తున్నప్పుడు మన కళ్లు ఆ కదలికలను గుర్తిస్తాయి. కానీ మన శరీరం మాత్రం స్థిరంగా ఒకే చోట కూర్చుని ఉంటుంది. ఈ స్థితిలో మెదడుకు అందే సంకేతాల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. కళ్లు ‘కదులుతున్నాం’ అని చెబుతుంటే, లోపలి చెవిలోని వెస్టిబ్యులర్ వ్యవస్థ ‘స్థిరంగా ఉన్నాం’ అని సిగ్నల్ ఇస్తుంది. ఈ గందరగోళాన్నే నిపుణులు ‘సెన్సరీ కాన్‌ఫ్లిక్ట్’ అని పిలుస్తారు. ఫలితంగా తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కొవిడ్ తర్వాత పెరిగిన ముప్పు

లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు, రిమోట్ వర్క్ వల్ల మన స్క్రీన్ టైమ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఈ సైబర్ సిక్‌నెస్ కేసులు కూడా రెట్టింపు అయ్యాయి. గంటల తరబడి స్క్రీన్లను చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి, అలసట, శరీరంపై చెమటలు పట్టడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు స్క్రీన్ చూడటం ఆపేసిన తర్వాత కూడా ఈ ప్రభావం కొన్ని గంటల పాటు కొనసాగవచ్చు.

నివారణ మార్గాలు

సైబర్ సిక్‌నెస్‌కు ప్రత్యేకమైన మందులు లేవు. మన అలవాట్లను మార్చుకోవడం ద్వారానే దీని నుంచి బయటపడవచ్చు.

  • 20-20-20 రూల్: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు బ్రేక్ తీసుకుని, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి.
  • హైడ్రేషన్: నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరం ఉత్తేజితమై సిక్‌నెస్ లక్షణాలు తగ్గుతాయి.
  • సెట్టింగ్స్: స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం, కళ్లకు ఇబ్బంది కలగకుండా ఫాంట్ సైజ్ సెట్ చేసుకోవడం మంచిది.
  • బ్రేక్స్: సోషల్ మీడియాలో నిరంతరం గడపకుండా అప్పుడప్పుడు డిజిటల్ డిటాక్స్ పాటించాలి.

    సాంకేతికతను వాడుకోవాలి కానీ, అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ డిజిటల్ ప్రపంచాన్ని ఆస్వాదించండి.