Corn: మొక్కజొన్న తింటున్నారా..? ఈ విషయాలు వెంటనే తెలుసుకోండి

తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఇది బరువు తగ్గడానికి, షుగర్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్, గోధుమ పిండి వంటి వాటితో పోలిస్తే, మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుందట ..

Corn: మొక్కజొన్న తింటున్నారా..? ఈ విషయాలు వెంటనే తెలుసుకోండి
Corn

Updated on: Jan 11, 2026 | 12:20 PM

సరైన ఆరోగ్యం, వెయిట్ కంట్రోల్, షుగర్ నివారణలో సరైన ఆహార ఎంపికల ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు పదే, పదే ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంపై హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) ఎన్నో పరిశోధనలు చేస్తోంది. NIN 2016లో విడుదల చేసిన ఒక పుస్తకంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లు, వాటి పోషక విలువలను విశ్లేషించారు. ఈ నివేదికలోని “టేబుల్ సిక్స్”లో వివిధ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలైన అన్నం, గోధుమలు, జొన్నలు, రాగులు వంటి వాటి పోషక విలువలు వివరంగా పొందుపరిచారు. బరువు తగ్గడానికి, షుగర్, రక్తపోటును నివారించడానికి కార్బోహైడ్రేట్లను తగ్గించాలని సాధారణంగా సూచిస్తుంటారు. NIN నివేదిక ప్రకారం.. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వైట్ రైస్ అత్యంత ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. దీని తరువాత రెడ్ రైస్, గోధుమ రవ్వ, గోధుమ పిండి వస్తాయి. ఈ క్రమంలో జొన్నలు, రాగులు వంటివి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. అయితే మొక్కజొన్న (ముఖ్యంగా స్వీట్ కార్న్) వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వెల్లడించారు.

మొక్కజొన్నను మనం సాధారణంగా స్వీట్ కార్న్ అని పిలుస్తూ ఉంటాం. కాగా అతి తక్కువ క్యాలరీలను, కార్బోహైడ్రేట్లను కలిగి ఉండేది మొక్కజొన్న అని NIN నివేదికలో వెల్లడైంది. దీనిలో అధిక ఫైబర్, తక్కువ కొవ్వు, ఎక్కువ నీటి శాతం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కలిపి మొక్కజొన్నను అత్యంత ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా మారుస్తాయి. దీనిలోని అధిక ఫైబర్, నీటి శాతం కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి, తద్వారా అతిగా తినకుండా ఉంటాం. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా, మొక్కజొన్న తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే, దీనిని తిన్నప్పుడు రక్తంలో షుగర్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి, ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు.. షుగర్ రాకుండా చూసుకోవాలనుకునే వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. మొక్కజొన్నను కాల్చి, ఉడకబెట్టి లేదా కూర రూపంలో కూడా తీసుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి .. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి మొక్కజొన్న ఒక చౌకైన, సులభంగా లభించే ..  అద్భుతమైన ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.

(ఈ సమాచారం నిపుణులు నుంచి సేకరించబడింది. మీకు ఎలాంటి సలహాలు, సూచనలు కావాలన్నా వైద్యులను సంప్రదించండి)