AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందలో 95 మంది మహిళలది ఇదే సమస్య.. నిజంగా మందులు లేకుండా చిట్కాలతో కంట్రోల్ చేయొచ్చా..

ఈ జ్యూస్ తాగితే థైరాయిడ్ మాయం... ఆ యోగాసనం వేస్తే టాబ్లెట్‌తో పనే లేదు.. ఇలాంటి సోషల్ మీడియా రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ చిట్కాలు చూసి మీరు కూడా నిజమే అనుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే.. సోషల్ మీడియాలో చెప్తున్నట్లు కేవలం డైటింగ్, ఇంటి చిట్కాలతోనే థైరాయిడ్‌ను పూర్తిగా నయం చేయవచ్చా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

వందలో 95 మంది మహిళలది ఇదే సమస్య.. నిజంగా మందులు లేకుండా చిట్కాలతో కంట్రోల్ చేయొచ్చా..
Can Social Media Remedies Cure Thyroid
Krishna S
|

Updated on: Jun 29, 2026 | 7:35 AM

Share

నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా థైరాయిడ్ అనేది ఇప్పుడు ప్రతి ఇంటి సమస్యగా మారిపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య ఎంత వేగంగా పెరుగుతుందో.. సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న తప్పుడు ప్రచారాలు, హోమ్ రెమెడీస్ కూడా అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ జ్యూస్ తాగితే థైరాయిడ్ మాయం, ఈ యోగాసనంతో టాబ్లెట్ వాడాల్సిన పనే లేదు’’ అంటూ నెటిజన్లు చేసే ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? అసలు వైద్య శాస్త్రం ఏం చెబుతోంది? ముంబైకి చెందిన ప్రఖ్యాత వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం.

వందలో 95 మంది మహిళల్లో అదే సమస్య..

శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల విపరీతమైన అలసట, కారణం లేకుండానే బరువు పెరగడం లేదా తగ్గడం, మానసిక ఒత్తిడి మరియు మహిళల్లో రుతుక్రమ అక్రమతలు వంటి వేలాది సమస్యలు తలెత్తుతాయి. గణాంకాల ప్రకారం.. ప్రతి 100 మంది మహిళల్లో దాదాపు 95 మంది ఏదో ఒక రకమైన థైరాయిడ్ హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడుతుండటం గమనార్హం.

చిట్కాలతో నయం కాదు.. డాక్టర్ నిమిత్ నాగ్రా

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే డిటాక్స్ డ్రింక్స్ లేదా హెర్బల్ సప్లిమెంట్లతో థైరాయిడ్ పూర్తిగా నయమవుతుందనే వాదనను వైద్యులు కొట్టిపారేస్తున్నారు. ‘‘థైరాయిడ్ సమస్యలు సాధారణంగా వాటంతట అవే నయం కావు. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాల్సిందే. చికిత్సను నిర్లక్ష్యం చేసి సొంత వైద్యాలు చేసుకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు.

జీవనశైలి మార్పులు మందులకు ప్రత్యామ్నాయం కావు..

మరోవైపు డయాబెటిస్, హార్మోనల్ నిపుణురాలు డాక్టర్ ఆర్తి ఉల్లాల్ ప్రకారం.. కేవలం జీవనశైలి మార్పులు లేదా డైట్ కంట్రోల్‌తో థైరాయిడ్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఖచ్చితంగా సహాయపడతాయి. కానీ అవి ఎప్పటికీ మందులకు ప్రత్యామ్నాయం కాలేవు. దీర్ఘకాలిక వ్యాయామం లేదా ఆహార నియమాలు కొన్నిసార్లు తాత్కాలికంగా హార్మోన్ల స్థాయిలను అదుపులోకి తీసుకురావచ్చు. కానీ ఆ రిలీఫ్ ఎక్కువ కాలం ఉండదు. పైగా ఇంటర్నెట్ చూసి ఏవో తెలియని మూలికా డ్రింక్స్ తాగడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు మరింత ఎక్కువై శారీరక సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.

తాత్కాలిక మార్పులు ఎప్పుడు వస్తాయి?

కొన్ని ప్రత్యేక సందర్భాలలో థైరాయిడ్ స్థాయిలలో తాత్కాలిక మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

గర్భధారణ సమయం: ప్రసవ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల థైరాయిడ్ రావచ్చు, కానీ డెలివరీ తర్వాత అది చాలావరకు సహజంగానే సాధారణ స్థితికి వస్తుంది.

ఇతర కారణాలు: కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల లేదా థైరాయిడ్ గ్రంథి అకస్మాత్తుగా వాపుకు గురికావడం వల్ల తాత్కాలికంగా హెచ్చుతగ్గులు రావచ్చు. మూల కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తే ఈ తాత్కాలిక సమస్య తగ్గిపోతుంది.

గూగుల్, సోషల్ మీడియా వైద్యం వద్దు..

థైరాయిడ్ లక్షణాలు కనిపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. ఇంటర్నెట్‌లో వచ్చే ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అయ్యే ముందు లేదా మీ సొంతంగా ల్యాబ్ రిపోర్టులు చూసి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుడైన ఎండోక్రినాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించడం ముఖ్యం. సరైన వైద్య చికిత్స, దానికి తోడు ఆరోగ్యకరమైన జీవనశైలి.. ఈ రెండింటి కలయికతోనే థైరాయిడ్‌ను పూర్తిగా అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది.

Follow Us