
బెల్లం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకారి. పాతకాలం నుంచి మన పూర్వికులు దీనిని ఆహారంలో భాగంగా ఉపయోగిస్తూ వచ్చారు. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, నెలసరి నొప్పులు, రక్తహీనత వంటి అనేక సమస్యలకు బెల్లం సహాయపడుతుంది. బెల్లాన్ని కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో కలిపి తింటే మరింత మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బెల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు బీ-కాంప్లెక్స్, సి, డి2, ఇ విటమిన్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఇది సహాయపడుతుంది. బెల్లం రక్తహీనత సమస్యను తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 2017లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బెల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తేలింది.
బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ధనియాల పొడితో కలిపి తీసుకుంటే నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే బెల్లాన్ని సోంపుతో కలిపి తింటే నోటి దుర్వాసనను తొలగించి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మెంతులతో కలిపి తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా మారి తెల్ల జుట్టు రాకుండా ఉండే అవకాశముంది. గోంద్‌తో కలిపి తింటే ఎముకల బలాన్ని పెంచి, పాలిచ్చే తల్లులలో చనుబాలు ఉత్పత్తిని పెంచుతుంది. అలీవ్ గింజలతో కలిపి తీసుకుంటే ఫోలికామ్లం, ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించేందుకు సహాయపడుతుంది. ఇది చర్మంపై ఉన్న పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది.
బెల్లాన్ని నువ్వులతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, ఫ్లూ సమస్యలు తగ్గుతాయి. పల్లీలతో కలిపి తింటే శరీర శక్తిని పెంచి ఆకలిని అదుపులో ఉంచుతుంది. పసుపుతో కలిపి తింటే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. శొంఠి పొడితో కలిపి తీసుకుంటే జ్వరం తగ్గడంతో పాటు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)