
ఎవరి ఇంట్లో అయినా ఎలుకలు తిరగడం అనేది కామన్‌గా ఉంటుంది. అయితే ఒక్కోసారి వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోని ఆహార పదార్థాలను పాడే చేయడం, వస్తువులను చిందర వందర చేయడం, పుస్తకాలను, బియ్యం సంచులను కొరికి నాశనం చేయడం చేస్తూంటాయి. ఒక్కోసారి బట్టలను కూడా కొరిక పారేస్తూంటాయి. అయితే వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, ప్రాణానికే ప్రమాదం అన్న సంగతి ఎవరికీ తెలీదు. అవును ఎలుకలతో ఎన్నో రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎలుకలు ఉంటే వెంటనే వాటిని వెళ్లగొట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎలుకలు అస్సలు ఉండకూడదు. ఎలుకల్ల వచ్చే సమస్యల్లో జ్వరం కూడా ఒకటి. ఎలుకల జ్వరం వస్తే.. ఏమీ కాదని అనుకుంటారు. వీటితో కేవలం జ్వరం మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో వ్యాధులకు కారణం అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఎలుక జ్వరం కూడా సాధారణ జ్వరంలానే అనిపిస్తుంది. ఎలుకలు కొరకడం లేదా గీరడం వల్ల మానవ శరీరంలోకి రెండు రకాల బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి. వీటి వల్ల జ్వరం వస్తుంది. వెంటనే చికిత్స తీసుకోకపోతే.. ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
సాల్మొనెల్లోసిస్ అనేది సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా నుంచి కలిగే ఇన్ ఫెక్షన్. ఇది ఎక్కువగా పక్షులు, జంతువుల పేగుల్లో కనిపిస్తుంది. ఇవి జంతువుల లేదా పక్షలు మలమూత్రాల ద్వారా బయటకు వచ్చి.. ఆహారం, నీరు వంటి మార్గాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే బయట ఆహారం తినడం అంత శ్రేయస్కరం కాదు. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది.
ఎలుకల వల్ల వచ్చే వ్యాధుల్లో ప్లేగు వ్యాధి కూడా ఒకటి. ప్లేగు వ్యాధి అనేది ఓ మహమ్మారి. ప్లేగు వ్యాధి కారణంగా వేల కొద్దీ మరణించిన చరిత్ర ఉంది. ఇది ఎలుకల వల్ల ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ మహమ్మారికి మందు ఉన్నా.. ఆసియా, ఆఫ్రికాలో ప్లేగు ముప్పు ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ వ్యాధిని ముందుగానే కనిపెట్టి తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదం. కాబట్టి ఇంట్లో ఎలుకలు ఉంటే వెంటనే తరిమికొట్టండి.