Masala Ingredients: భారతీయుల వంట ఇల్లే వైద్య శాల. పోపుల పెట్టె ఔషధాల గని.. మనం తినే ఆహారంలో వాడే పోపుదినుసులు, మసాలా దినుసుల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకని మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఈరోజు మనం కూరల్లో వేసుకునే మసాలా దినుసులు ఏ విధంగా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయో తెలుసుకుందాం..
అల్లం:
అల్లం పైత్యానికి విరుగుడులా పనిచేస్తుంది. అంతేకాదు అజీర్ణ వ్యాధులకు అద్భుత ఔషధం. ముఖ్యంగా ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం చెబుతుంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లి గుండెకు మంచి నేస్తం. పచ్చివెల్లుల్లి తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ వెల్లులిలో ఎక్కువగా ఉన్నాయి.
జీలకర్ర:
ఆకలి మందగించినా అజీర్ణంతో ఇబ్బందులు పడుతున్నా జీలకర్ర మంచి ఔషధం. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థకు అంటువ్యాధుల సోకకుండా రక్షణ కలిపిస్తుంది.
లవంగాలు:
లవంగాలు శ్వాసకు మేలు చేస్తాయి. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాల్లో లవంగాలను ఉపయోగిస్తున్నారు.
ఆవాలు:
ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస ఇబ్బందులను తొలగిస్తుంది.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క పోషకాల గని. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, సోడియం, విటమిన్ సి వంటి అనేక పోషకాలున్నాయి. వీటివలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని పలు పరిశోధన ద్వారా తెలిసింది.
నల్లమిరియాలు:
కొన్ని దేశాల్లో కొని ఆహారపదార్ధాలలో కారంకి బదులు మిరియాలను ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. ఆహారం తేలికగా జీర్ణంకావడానికి అవసరమైనహైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా మహిళల ఋతు క్రమ సమయంలో మిరియాలతో బ్లాక్ కాఫీని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.
యాలకులు:
ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి యాలకులు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
పసుపు:
పసుపు రోగనిరోధక శక్తి కలిగి ఉంది. అంతేకాదు రక్త శుద్ధికి, కాలేయం, కంటి వ్యాధులకు, గాయాలు తగ్గడానికి, వాపులతో కూడిన నొప్పులకు ఉపయోగించే ఔషధాల్లో పసుపు ఉపయోగిస్తున్నారు. చర్మం సంబంధ గజ్జి ఉన్నప్పుడు పసుపు, నూనె కలిపి రాస్తే..మంచి ఉపశమనం కలుగుతుంది. బెణికిన నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Karthika Deepam: మోనిత గతం వెలుగులోకి.. అంజిని పట్టుకుంటే నిజం తెలుస్తుందంటున్న దీప..