గంటల కొద్దీ నరకానికి ఎండ్ కార్డ్.. కేవలం 7 నిమిషాల్లోనే క్యాన్సర్ ట్రీట్‌మెంట్..
క్యాన్సర్ అనే పేరు వింటేనే రోగుల కంటే.. వారిని చూసుకునే కుటుంబ సభ్యులే ఎక్కువ మానసిక నరకాన్ని అనుభవిస్తారు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, బెడ్స్ దొరక్క గంటల కొద్దీ వెయిట్ చేయడం.. ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు చెక్ పెడుతూ మెడికల్ హిస్టరీలోనే ఒక అద్భుతం జరిగింది. స్విస్ ఫార్మా దిగ్గజం రోచ్ తెచ్చిన ఒకే ఒక్క ఇంజెక్షన్.. ట్రీట్‌మెంట్ టైమ్‌ను ఏకంగా 80 శాతం తగ్గించేసింది.

క్యాన్సర్ మహమ్మారితో పోరాడే రోగులకు ఒక అద్భుతమైన శుభవార్త. హాస్పిటల్ బెడ్స్‌పై గంటల కొద్దీ సెలైన్ బాటిల్స్ పెట్టుకుని నరకయాతన పడే రోజులకు కాలం చెల్లనుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చర్మం కింద ఇచ్చే సరికొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ప్రముఖ స్విస్ ఫార్మా దిగ్గజం రోచ్ ఈ సరికొత్త డ్రగ్‌ను గురువారం భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.
80శాతం తగ్గిన సమయం.. 7 నిమిషాల్లోనే డిశ్చార్జ్..
గతంలో క్యాన్సర్ రోగులకు ఐవీ ద్వారా డ్రిప్స్ పెట్టాల్సి వచ్చేది. దీనివల్ల గంటల కొద్దీ హాస్పిటల్‌లోనే గడపాల్సి వచ్చేది. కానీ ఈ సరికొత్త ఇంజెక్షన్ ద్వారా కేవలం 7 నిమిషాల్లోనే ట్రీట్‌మెంట్‌ను పూర్తి చేయవచ్చు. ఇది రోగుల చికిత్స సమయాన్ని ఏకంగా 80 శాతం వరకు తగ్గిస్తుంది. కేవలం హాస్పిటల్‌కు రావడం ఇంజెక్షన్ తీసుకోవడం, వెంటనే ఇంటికి వెళ్లిపోవడం.. అంతా చకచకా జరిగిపోతుంది.
ధర ఎంత? ఎవరికి ఉపయోగం?
భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ మూడు నెలల క్రితమే ఈ మందుకు అనుమతులు ఇచ్చింది. నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉన్న రోగులకు ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఒక డోస్ ధర రూ.3.7 లక్షలు. దీనిని ప్రతి 21 రోజుల సైకిల్‌కు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డ్ ఉన్నవారికి కూడా ఈ మందు అందుబాటులో ఉంటుంది.
పురుషుల్లో పెరిగిపోతున్న లంగ్ క్యాన్సర్ మహమ్మారి
భారతదేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఏటా దాదాపు 80,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో ధూమపానం, పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల ఈ క్యాన్సర్ ప్రమాదకరంగా మారుతోంది. దురదృష్టవశాత్తూ 80 నుండి 90 శాతం మంది రోగులు వ్యాధి ముదిరిన స్టేజ్‌లో మాత్రమే దీనిని గుర్తిస్తున్నారు.
హాస్పిటల్స్, డాక్టర్లకు కూడా పెద్ద ఊరట..
ఈ ఇంజెక్షన్ రాకతో మెడికల్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ప్రముఖ ఆంకాలజిస్టులు చెబుతున్నారు. “గతంలో ఒక రోగికి డ్రిప్ ద్వారా థెరపీ ఇవ్వడానికి గంటల సమయం పట్టేది. దీనివల్ల హాస్పిటల్‌లో బెడ్స్ కొరత వచ్చేది. కానీ ఈ ఇంజెక్షన్ వల్ల ఒక పేషెంట్ తీసుకునే సమయంలో.. ఏకంగా ఐదుగురు రోగులకు ట్రీట్‌మెంట్ ఇవ్వొచ్చు. హాస్పిటల్ బెడ్స్, చైర్ టైమ్ చాలా ఆదా అవుతుంది’’ అని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి డాక్టర్ అమిత్ రౌతన్ తెలిపారు. ‘‘మేము ఫిబ్రవరి నుంచే మా హాస్పిటల్‌లో ఈ మందును వాడుతున్నాం. ఇది రోగులకు మానసిక, శారీరక నరకాన్ని తగ్గించింది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. ఎలాంటి కీమోథెరపీ అవసరం లేకుండా ఒంటరిగానేఈ డ్రగ్ అద్భుతంగా పనిచేస్తుంది’’ అని మేదాంత డాక్టర్ సజ్జన్ రాజ్‌పురోహిత్ చెప్పారు.
విన్-విన్ సిట్యుయేషన్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో ఆమోదం పొందిన ఈ ఇంజెక్షన్, ఇప్పటికే 10,000 మందికి పైగా రోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అటు రోగులకు, ఇటు డాక్టర్లకు, హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్‌కు.. అందరికీ లాభం చేకూర్చే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో క్యాన్సర్ వైద్య విధానాన్ని పూర్తిగా మార్చేయబోతోంది.
