హరిదాసుల సందడి మొదలైంది… వీరు ప్రతి ఇంటికి ఎందుకు వస్తారు..?

పవిత్రమైన "ధనుర్మాసం" ప్రారంభం అయ్యింది. ధనుర్మాసం ప్రారంభంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో నెలరోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరమైనది, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలది. హరిదాసులు "హరిలో రంగ హరి" అంటూ అక్షయపాత్రతో ఇంటింటికి తిరుగుతూ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ధనుర్మాసం ప్రారంభమవ్వగానే హరిదాసుల సందడి మొదలైనట్టే అయితే వీరు ధనుర్మాసంలోనే ఎందుకు వస్తారు.

హరిదాసుల సందడి మొదలైంది... వీరు ప్రతి ఇంటికి ఎందుకు వస్తారు..?
Haridasus In Dhanurmasam

Edited By:

Updated on: Dec 18, 2025 | 5:34 PM

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం మొదలైంది. తలమీద అక్షయపాత్ర, చేతిలో చిడతలతో “హరిలో రంగ హరి” అంటూ హరిదాసులు పల్లె బాట వట్టారు. వీరు శివకేశవుల కీర్తనలు అలపిస్తూ ఇంటింటికి తిరుగుతుంటే వీధులన్నీ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. కొందరు కాలినడకన , మరికొందరు వాహనాలపై తిరుగుతూ సాంప్రదాయాన్ని చాటుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడిపందాల రాయుళ్లు కోడిపుంజులను పోరుకు సిద్ధం చేస్తుంటారు. పల్లెలు , పట్టణాలు తేడాలేకుండా ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెడుతుంటారు . వాటిలో గొబ్బిళ్ళు పెట్టి , పూలతో అలంకరిస్తుంటారు. పండుగ సమీపిస్తుందనగా మన తెలుగువారి ప్రాచీన సాంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, సున్నుండలు, పోకుండలు, జిలేబీలు, జంతికలు వంటివి వండుతారు. అమ్మమ్మలు, నానమ్మలు చేసే ఈ పిండివంటలకు సంక్రాంతి సెలవులకు మనవళ్లు, మనవరాలు, బంధుమిత్రులు వస్తుంటారు.

ఇక ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ధనుర్మానం విశిష్టమైనది. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు ఉండే ఈ మాసాన్ని మార్గశిర మాసం అనికూడా అంటారు. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని విశ్వవాసం. ఇక ఆ శ్రీ మహావిష్ణువులో (రంగనాథుడు) ఐక్యమైన మహా భక్తురాలు ఆండాళ్ అమ్మ వారు. ఆమె చూపిన భక్తి మార్గమే ధనుర్మాసానికి ప్రాణం. ఈ మాసంలో వైష్ణవాలయాల్లో ప్రతిరోజూ తిరుప్పావై పారాయణం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ఈ ధనుర్మాసం నెల రోజులు గ్రామాలలో ఆలయాల వద్ద తెల్లవారుజామున భాజా భజంత్రీలు, కోలాటాలు, చలి మంటలు, భోగి మంటల సందడి మొదలువుతుంది. ఈ నెల రోజులు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో హరిదాసు సంకీర్తనలు కనిపిస్తాయి.. వినిపిస్తాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు అంటారు పెద్దలు. హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి అనే నానుడి ఉంది.

హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే ధనధాన్యాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించే వారే హరిదాసులు. పండుగ నెల ధనుర్మాసంలో నెలరోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు, దానాలను హరిదాసులు స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయపాత్ర (పంచలోహ పాత్ర )వారి శిరస్సుపై ధరిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పట్టించి, అక్షయపాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గ్రామాలలో, పల్లెలలో ఇంటింటికి తిరిగి హరిదాను తమ స్వగృహానికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరి ఏమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు ఇంటికి వెళ్లాక ఇల్లాలు హరిదాసు పాదాలు కడిగి అక్షయపాత్రను దించుతుంది.

ఇవి కూడా చదవండి

శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసు అని అంటారు. గొబ్బెమ్మలు ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తారు అన్నది పెద్దల నమ్మకం. హరిదాసు పేద, ధనిక తారతమ్య బేధం లేకుండా అందరి ఇంటికి వెళ్తారు.. ఎవరి ఇంటి ముందు ఆగరు. “శ్రీమద్రామారమణ గోవిందో హరి’ అంటూ ఇంటిముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారు. హరిదాసు ఉత్తి చేతులతో వెళ్లిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాల్లో హరిదాసు వస్తున్నాడు అంటే గృహ యజమానులు, పిల్లలు గుమ్మాలలో ధాన్యంతో, బియ్యంతో, పళ్ళతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లు భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి పాత్రను భూమికి సంకేతంగా చెబుతారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..