
ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్న నేపథ్యంలో, డీహైడ్రేషన్ ఒక తీవ్ర సమస్యగా మారింది. కేవలం మంచినీళ్లు త్రాగడం ద్వారా శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడం కష్టం. ఎలక్ట్రోలైట్లు శరీరానికి అత్యవసరం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేడిగాలులు తీవ్రంగా ఉండడంతో ప్రజలు వడదెబ్బ, తీవ్ర అలసట బారిన పడకుండా ఉండటానికి ఎలక్ట్రోలైట్లను తీసుకోవాలి.
ఎలక్ట్రోలైట్లు శరీరంలోని ద్రవ సమతుల్యతను, కండరాల పనితీరును, నరాల ప్రసరణను నియంత్రిస్తాయి. చెమట రూపంలో శరీరం ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. వేడి వాతావరణంలో పనిచేసేవారు లేదా బయట ఎక్కువ సమయం గడిపేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బతో పలువురు ఆస్పత్రిలో చేరుతున్న సంఘటనలు.. వేసవి జాగ్రత్తల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. వేసవిలో సురక్షితంగా ఉండటానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఎలక్ట్రోలైట్లపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.