Lata Mangeshkar: ఓపీ నయ్యర్‌ లతా మంగేష్కర్‌తో ఎందుకు పాడించలేదో తెలుసా?

|

Feb 06, 2022 | 5:23 PM

తమ మ్యూజిక్‌లో లతా మంగేష్కర్‌ ఒక్క పాట పాడినా చాలు అదే మహద్భాగ్యమని సంగీత దర్శకులు భావిస్తున్న కాలంలో ఓ.పీ.నయ్యర్‌ మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

Lata Mangeshkar: ఓపీ నయ్యర్‌ లతా మంగేష్కర్‌తో ఎందుకు పాడించలేదో తెలుసా?
O.p.nayyar Lata Mangeshkar
Follow us on

O.P.Nayyar on Lata : తమ మ్యూజిక్‌లో లతా మంగేష్కర్‌(Lata Mangeshkar) ఒక్క పాట పాడినా చాలు అదే మహద్భాగ్యమని సంగీత దర్శకులు భావిస్తున్న కాలంలో ఓ.పీ.నయ్యర్‌(O.P.Nayyar) మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సంగీత దర్శకుడిగా తన జీవితకాలం లతాతో ఒక్క పాట కూడా పాడించలేదు. అంత పంతం ఎందుకు పట్టాల్సి వచ్చింది? అసలు ఇద్దరి మధ్య అంత వైరం ఎందుకొచ్చింది? దీనికి రకరకాలుగా చెబుతుంటారు కానీ.. లతా మంగేష్కర్‌ జీవిత చరిత్రను రాసిన రాజూ భరతన్(Raja Bharatan) చెప్పిందేమిటంటే…

ఆస్మాన్‌ సినిమాతో ఓపీ నయ్యర్‌ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. రెండేళ్ల తర్వాత ఆర్‌పార్‌ సినిమా వచ్చింది.. అది సూపర్‌ హిట్‌ కావడంతో నయ్యర్‌కు అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. కొంతమంది నిర్మాతలు తాము అంతకు ముందు బుక్‌ చేసిన సంగీత దర్శకులను తొలగించి ఓపీ నయ్యర్‌ను సంగీత దర్శకుడిగా నియమించుకున్నారు. అలా మెహబూబా సినిమా నిర్మాత కె.అమర్‌నాథ్‌ కూడా రోషన్‌ను తొలగించి నయ్యర్‌ను తీసుకున్నారు. అలాగే మంగూ సినిమాకు సంగీత దర్శకుడిగా బుక్‌ అయిన మహమ్మద్‌ షషీని కూడా ఆ సినిమా నిర్మాత తొలగించాడు. నయ్యర్‌ను తీసుకున్నాడు.

ఆ సమయంలో తన ఆర్ధిక పరిస్థితి అసలు బాగోలేదని, అందుకే ఒప్పుకోవలసి వచ్చిందని నయ్యర్‌ చెప్పుకున్నాడు. కానీ రోషన్‌పై విపరీతమైన గౌరవాభిమానులున్న లతా మంగేష్కర్‌కు మాత్రం నయ్యర్‌పై కోపం పెంచుకుంది. రోషన్‌ మ్యూజిక్‌లో అప్పటికే ఓ పాట పాడేసింది లతా. నయ్యర్‌కు ఛస్తే పాడనని బహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. లతా ఇలా అనేసరికి నయ్యర్‌కు కూడా కోపం వచ్చేసింది. అసలు నేను లతాతో పాడిద్దామనుకుంటే కదా ఆమె పాడటమో పాడకపోవడమో తేల్చుకోవడానికి. నేను ఆమెతో పాడించకూడదనే అనుకున్నాను అని నయ్యర్‌ అన్నాడు. దీంతో లతా ఇగో దెబ్బతింది. వెంటనే సినీ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కు కంప్లయింట్ చేసింది. ఆ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న అనిల్‌ బిశ్వాస్‌, ఇతర సభ్యులు నయ్యర్‌కు ఎవరూ పాడకూడదని ఆదేశించారు. నయ్యర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే షంషాద్‌ బేగం దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పుకున్నాడు. ఏం ఫర్వాలేదు. నువ్వు ఎన్ని పాటలు పాడమంటే నేను అన్ని పాటలు పాడతాను అని నయ్యర్‌కు భరోసా ఇచ్చింది షంషాద్‌ బేగం. హమ్మయ్య అని అనుకున్నాడు నయ్యర్‌. ఇక జన్మలో లతాతో పాడించకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడు.

అంతేనా.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం లతా పేరిట నెలకొల్పిన అవార్డును నయ్యర్‌కు ఇవ్వాలనుకుంది. నయ్యర్‌ మరో ఆలోచన లేకుండా తిరస్కరించాడు. అవార్డుతో పాటు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. కావాలంటే మీ అవార్డును గీతాదత్‌ అవార్డు అని మార్చండి. హాయిగా వచ్చి తీసుకుంటాను. నేనేమిటి, లతా పేరిట ఉన్న అవార్డు తీసుకోవడమేమిటి? ఇది కుదరని పని అని చెప్పేశాడు..