
పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ మెగాస్టార్ ఇంట్లో ఉన్న ఒక ‘గోల్డెన్ టాయిలెట్’ను చూసి ముచ్చటపడి ఆయన తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఆ నటుడు ఎవరు? మెగాస్టార్ ఇంటికి ఎందుకు వెళ్లారు?
నటుడు విజయ్ వర్మ ఆదివారం తన అభిమానులను గతంలోకి తీసుకెళ్లారు. 2016 సంవత్సరం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. “ఆ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, షూజిత్ సర్కార్‌లతో కలిసి ‘పింక్’ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను కలిశాను. అన్నింటికంటే ముఖ్యంగా బచ్చన్ గారి ఇంట్లో ఉన్న గోల్డెన్ టాయిలెట్‌తో సెల్ఫీ దిగాను” అంటూ విజయ్ వర్మ సరదాగా రాసుకొచ్చారు.
Vijay Varma With Golden Toilet Pic
విజయ్ వర్మ పంచుకున్న ఫోటోలలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఉన్న స్టిల్స్ తో పాటు, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌తో ఉన్న ఫోటో నెటిజన్లను ఎమోషనల్ చేస్తోంది. తనకెంతో ఇష్టమైన హీరో ఇర్ఫాన్ ఖాన్‌ను కలవడం ఒక మరపురాని అనుభూతి అని ఆయన తెలిపారు. అలాగే జిమ్ సెషన్స్ సమయంలో ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రాలతో ఏర్పడిన స్నేహం, విద్యుత్ జమ్వాల్‌తో కలిసి చేసిన పనులు తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని విజయ్ వర్మ గుర్తు చేసుకున్నారు.
విజయ్ వర్మకు నటుడిగా గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులలో ‘పింక్’ ప్రధానమైనది. ఇందులో ఒక నెగటివ్ పాత్రలో ఆయన నటించారు. ఈ పాత్ర గురించి విజయ్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. “ఈ సినిమాలో తాప్సీ పన్నుతో ఒక సీన్ చేస్తున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆ పాత్ర అంత క్రూరంగా ఉంటుంది. దర్శకుడు షూజిత్ సర్కార్ నాకు ఒకటే చెప్పారు.. ఈ సినిమా చూసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి నిన్ను కొట్టాలని అనుకోకపోతే, నువ్వు సరిగ్గా నటించనట్టే లెక్క అని అన్నారు. సినిమా చూసిన తర్వాత జనం నన్ను కొట్టలేదు కానీ, నిన్ను కొట్టాలని అనిపించిందని మాత్రం చెప్పారు. ఒక నటుడిగా నేను దాన్ని సక్సెస్‌గా భావిస్తాను” అని విజయ్ వర్మ పేర్కొన్నారు.
విజయ్ వర్మ ఇటీవల నసీరుద్దీన్ షా, ఫాతిమా సనా షేక్‌లతో కలిసి ‘గుస్తాఖ్ ఇష్క్’ లో కనిపించారు. మనీష్ మల్హోత్రా నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న విజయ్ వర్మ, పాత రోజులను గుర్తు చేసుకోవడం ఆయన అభిమానులను అలరిస్తోంది. జీరో నుండి మొదలై నేడు స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ వర్మ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. బచ్చన్ ఇంటి గోల్డెన్ టాయిలెట్ సెల్ఫీ నుండి నేటి వరకు ఆయన సాధించిన ప్రగతి అద్భుతం.