
30 ఏళ్లు దాటినా పెళ్లి కాని హీరోయిన్ల లిస్ట్‌లో చెన్నై బ్యూటీ త్రిష ఒకరు. అన్నీ కుదిరి ఉంటే ఈ అమ్మడి పెళ్లి జరిగి ఇప్పటికి ఐదేళ్లు గడిచేది. కానీ కొన్ని కారణాల వలన త్రిష పెళ్లి అప్పట్లో ఆగిపోయింది(నిర్మాత వరుణ్ మణియన్‌తో నిశ్చితార్ధం జరిగి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే). అయితే కోలీవుడ్ తాజా సమాచారం ప్రకారం త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా వివాదాస్పద హీరో శింబుతో అన్న టాక్ తమిళ సినీ వర్గాల్లో నడుస్తోంది.
కాగా సినిమాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నప్పటికీ, వివాదాలతో పలుమార్లు శింబు వార్తల్లో నానారు. దానికి తోడు గతంలో ఇద్దరు హీరోయిన్లను(నయనతార, హన్సిక) ప్రేమించి విఫలమయ్యారు. ఇక ఇటీవల వీరిద్దరి మధ్య ప్రేమ కలిగిందని, వారి పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. త్వరలోనే వివాహం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై శింబు, త్రిష ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా వీరిద్దరు విన్నైతాండి వరువాయ(ఏమాయ చేశామే తమిళ్ వెర్షన్), అలై అనే చిత్రాల్లో కలిసి నటించారు. ఈ రెండు మంచి విజయాన్ని సాధించాయి. లాక్‌డౌన్ సమయంలో ‘కార్తీక్ డయల్ సైతా ఎన్’ అనే షార్ట్ ఫిలింలో కలిసి నటించారు. ఇక ప్రస్తుతం విన్నైతాండి వరువాయ సీక్వెల్‌లో ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.