
భారీ అంచనాలతో, కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రమోషన్స్ చేసి విడుదల చేస్తున్న బాలీవుడ్ సీక్వెల్స్ కూడా సౌత్ ఇండియాలో తమ మార్క్‌ను చూపించలేకపోతున్నాయి. ఉదాహరణకు నార్త్‌లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ధురంధర్ 2 లాంటి సినిమాలు కూడా తెలుగు, తమిళ భాషల్లో డబ్ అయ్యి విడుదలైనా ఇక్కడి ప్రేక్షకులను ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాయి. పాన్ ఇండియా అప్పీల్ ఉందని బాలీవుడ్ మేకర్స్ ఎంతగా నమ్ముతున్నా, సౌత్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ మ్యాజిక్ ఏమాత్రం వర్కౌట్ అవ్వడం లేదు. యానిమల్ లాంటి సినిమాలు కూడా తెలుగు వర్షన్ కంటే హిందీ వర్షన్‌కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ధురంధర్ 2కు కూడా ఇదే జరుగుతుంది. హిందీ వర్షన్ చూసినట్లుగా డబ్బింగ్ వర్షన్ చూడట్లేదు ఆడియన్స్.
దీనికి ప్రధాన కారణం.. సౌత్ ప్రేక్షకులకు తమ స్థానిక హీరోలు, డైరెక్టర్ల పట్ల ఉన్న అపారమైన అభిమానం. హిందీ బెల్ట్‌తో పోలిస్తే ఇక్కడి ఆడియన్స్ తమ స్టార్స్‌ను నెత్తిమీద పెట్టుకుంటారు, వాళ్ల పట్ల ఒక రకమైన ‘లాయల్టీ’ని ప్రదర్శిస్తారు. పైగా సౌత్ మేకర్స్ తమ ప్రేక్షకులకు ఏం కావాలో పక్కాగా అంచనా వేసి కంటెంట్ అందిస్తున్నారు. తమ మాతృభాషలో వస్తున్న కంటెంట్‌తో ఆడియన్స్ పూర్తి సంతృప్తిగా ఉండటం వల్ల బాలీవుడ్ సినిమాలు ఇక్కడ నిలదొక్కుకోలేకపోతున్నాయి. మరోవైపు నార్త్ ఇండియాలో బాలీవుడ్ స్టార్‌డమ్ క్రమంగా తన మెరుపును కోల్పోతోంది. గ్లోబల్ కంటెంట్‌కు ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం, ప్రేక్షకుల్లో వచ్చిన కల్చరల్ మార్పుల వల్ల పాత ఫార్ములాలు ఇప్పుడు పనిచేయడం లేదు.
దీనికి తోడు బాలీవుడ్ స్టార్లు, క్రియేటర్లు సామాన్య మాస్ ప్రేక్షకులకు బాగా దూరమయ్యారు. కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్, ఎన్నారైలు, ఎలైట్ వర్గాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తుండటం వాళ్ళకు అతిపెద్ద మైనస్‌గా మారింది. ధురంధర్ లాంటి సినిమా తెలుగు వాళ్లు తీసుంటే.. హిందీలోనే పుష్ప 2 లాగా 800 కోట్లు వసూలు చేసుండేది.. సౌత్ నుంచి మరో 500 కోట్లు వచ్చుండేది. కానీ ధురంధర్ విషయంలో అది జరగలేదు. సౌత్‌లో ఈ సినిమాను చూసారంటే చూసారంతే.. కానీ రికార్డులు మాత్రం రాలేదు. కనీసం 100 కోట్లు కూడా సౌత్ నుంచి ధురంధర్‌కు రావట్లేదంటే.. ఇక్కడ ఆడియన్స్ ఎంత లాయల్‌గా ఉన్నారో అర్థమైపోతుంది. సరిగ్గా బాలీవుడ్ వదిలేసిన ఈ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యాప్‌ను మన సౌత్ సినిమాలు తెలివిగా క్యాష్ చేసుకున్నాయి.
‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ లాంటి సినిమాలు నార్త్ ఇండియాలో రికార్డులు బద్దలు కొట్టడానికి ప్రధాన కారణం ఇదే. అక్కడి సామాన్య ప్రేక్షకులు ఎప్పటినుంచో మిస్ అవుతున్న ‘లార్జర్ దాన్ లైఫ్’, ‘హై-వోల్టేజ్ మాస్ యాక్షన్’ ఎలిమెంట్స్‌ను మన వాళ్లు వాళ్ల ముందుకు తీసుకొచ్చారు. అందుకే బాలీవుడ్ మాస్ ఆడియన్స్ సైతం మన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేయడం బాలీవుడ్ వల్ల అవుతుందా అంటే.. ప్రస్తుతానికైతే ఆ ఛాన్స్ కనిపించడం లేదు. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి మారాలంటే ఒకటే మార్గం. ఒక భారీ బాలీవుడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను మన తెలుగు స్టార్ హీరో లీడ్ చేయగలిగితే.. అప్పుడు మాత్రమే ఆ బాలీవుడ్ సినిమా సౌత్‌లో, ముఖ్యంగా తెలుగునాట వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. అప్పటివరకు సౌత్ ఇండియాలో మన లోకల్ స్టార్లదే హవా అనడంలో ఎలాంటి సందేహం లేదు!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.