ఆమె స్వరరాగ మాధుర్యం. పాడిన ప్రతి పాట అద్భుతమే. భక్తి గీతం ఆలపిస్తే ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. మెలొడీ గీతాలలో ఆమె స్వరం ఒక్కసారి వింటే జీవితాంతం వెంటాడుతునే ఉంటుంది. డైరెక్టర్ కె.విశ్వనాద్ శంకరాభరణం సినిమాలో దొరకునా ఇటువంటి సేవా.. ఏ తీరుగ నను దయచూచెదవో.. పలుకే బంగారమాయెనా.. మానస సంచరరె.. బ్రోచేవారెవరురా .. అంటూ ఆమె ఆలపిస్తుంటే శ్రోతల హృదయాలు పరవశించిపోయేవి. దాదాపు 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. ఆనతి నీయరా హరా.. అంటూ ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి తెలుగు వారి మదిలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు సింగర్ వాణీ జయరాం. మద్రాసు అమ్మాయి వివాహం అనంతరం ముంబయికి వెళ్లి హిందీ సినిమాల్లో ఎన్నో వేల పాటలు పాడి.. కొన్నేళ్లపాటు అక్కడ అగ్రస్థానంలో కొనసాగారు. ఈ క్రమంలోనే అక్కడ ఎదురైన చేదు అనుభవాలు తట్టుకోలేక మళ్లీ మద్రాసుకు వచ్చేసినట్లు గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో వాణీ తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర గాయనీమణులుగా చెప్పుకునే వారిలో ఆమె ఒకరు. ఆమె అకాల మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది. దాదాపు 20 వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం.. తెలుగులో పాడింది చాలా తక్కువ పాటలే. ఇక్కడ నెంబర్ వన్ సింగర్ కాలేకపోయారు. అలాగే లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ తో గొడవ. ఇలా ఒక్కటేమిటీ ఆమె జీవితంలో ఎన్నో సంఘటనలు.
లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ వాణి జయరామ్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో క్రమంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో ఈ వీరి మధ్య గొడవ వచ్చిన వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “నా పాటలు మంచి ఆదరణ పొందేసరికి తనకు ఎక్కడ పోటీగా వస్తానోనని భావించారు. గుడ్డిలో నా పాటలు ప్రజాదరణ పొందాక.. ఆమె ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లాను. కాకపోతే నన్నుకలవడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. 1979లో విడుదలైన మీరా మా మధ్య మరింత దూరాన్ని పెంచింది. మీరా చిత్రానికి పండిట్ రవిశంకర్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు డైరెక్టర్ గుల్జార్. అయితే లతా మంగేష్కర్ కు నచ్చలేదు. తన సోదరుడిగా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోకపోతే ఈ సినిమాలో తాను పాటలు పాడనని చెప్పారు. దాంతో గుల్జార్ నాతో ఆ సినిమాలోని పాటలన్నీ పాడించారు. అలా లతాజీకి నాపై కోపం ఎక్కువైంది. కొన్నాళ్లకు బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయాలు చూసి విసుగు వచ్చేసి మద్రాసు తిరిగి వచ్చేశాను” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ కాకపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.
తమిళ్, కన్నడ, మలయాళంలో కంటే తెలుగులో చాలా తక్కువ పాటలు నా వరకు వచ్చాయి. 11 సంవత్సరాలు.. దక్షిణాదిలో నెంబర్ వన్ సింగర్ నేనే. కానీ తెలుగులో మాత్రం కాదు. తమిళంలో రెండు పాటలు పాడితే.. తెలుగులో కేవలం ఒక్క పాట మాత్రమే పాడాను. నా పీరియడ్ తర్వాత చిత్రకు అనేక పాటలు ఇచ్చారు. ఇక్కడ ఏ సింగర్ తో నాకు ఎలాంటి సమస్య రాలేదని అన్నారు. ప్రస్తుతం వాణీ జయరాం మాటలు నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.