Puneeth Rajkumar Death: మొన్న సిద్ధార్థ్ శుక్లా.. నేడు పునీత్ రాజ్‌కుమార్‌.. ప్రాణాలు తీస్తోన్న ఓవర్ వర్కవుట్స్ !

|

Oct 29, 2021 | 7:36 PM

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణం మరువకముందే.. కన్నడ హీరో రాజ్‌కుమార్‌ మృతి విషాదం నింపింది. ఇంచుమించు ఇద్దరూ జిమ్‌ ఎఫెక్ట్‌తోనే చనిపోయారు.

Puneeth Rajkumar Death: మొన్న సిద్ధార్థ్ శుక్లా.. నేడు పునీత్ రాజ్‌కుమార్‌.. ప్రాణాలు తీస్తోన్న ఓవర్ వర్కవుట్స్ !
Puneeth Rajkumar Sidharth Shukla
Follow us on

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణం మరువకముందే.. కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ మృతి విషాదం నింపింది. ఇంచుమించు ఇద్దరూ జిమ్‌ ఎఫెక్ట్‌తోనే చనిపోయారు. ఆరోగ్య స్పృహ ఉండడం అవసరమే.. అందుకోసం జిమ్‌ కెళ్లడం మంచిదే. కానీ అతిగా చేసే కసరత్తులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఎక్సర్‌సైజులు చేస్తూ చాలా ఫిట్‌గా హ్యాండ్సమ్‌గా కనిపించే కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం తీవ్రంగా కలచివేసింది. జిమ్‌లో వర్కవుట్ హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయాడు. జిమ్‌ సిబ్బంది వెంటనే రాజ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండాపోయింది.

రాజ్‌కుమార్‌ జిమ్ వర్కవుట్లే ప్రాణాల మీదకు తెచ్చాయా? ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. కానీ జిమ్‌లో ఎంతసేపు.. ఎంత తీవ్రతతో.. ఏ రకం వ్యాయామాలు చేయాలన్న చర్చ మాత్రం మళ్లీ తెరమీదకొచ్చింది. కారు కొత్తగా కలర్‌ఫుల్‌గా కనిపించొచ్చు. కానీ లోపల ఇంజన్‌ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. మనిషి కూడా అంతే. పైకి ఆరోగ్యంగా కనిపించినా అంతర్గత ఆరోగ్యం ఎంత మెరుగ్గా ఉందో ఎదుటివాళ్లే కాదు.. వాళ్లంతట వాళ్లూ తెలుసుకోలేరు. అంతర్గత ఆరోగ్యం అనేది ఆహార, జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌, మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లు.. ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి ఎన్నో అంశాలు అంతర్గత ఆరోగ్యాన్ని శాసిస్తాయి. వాటన్నిటినీ అంచనా వేయకుండా.. ఎవరికి వారు తాము ఆరోగ్యంగా ఉన్నామనుకుని వ్యాయామాలు చేసేస్తున్నారు. అదే అనర్ధాలకు దారిస్తోంది.

నిజానికి ఫిట్‌నెస్‌ మీద ఆసక్తితో జిమ్‌లో చేరాలనుకునే వారు ముందు తమ ఆరోగ్యం గురించి పూర్తి అంచనాకు రావాలి. డాక్టర్లను కలిసి ప్రీ అథ్లెటిక్‌ హెల్త్‌ ఎవాల్యుయేషన్‌ చేయించుకోవాలి. వ్యాయామానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇస్తేనే వర్కవుట్స్ స్టార్ట్ చేయాలి. కానీ ఇలా ఎవరు చేయడం లేదు. ఇష్టానుసారంగా కోరుకున్న షేప్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు.  జిమ్‌లో వ్యాయామం చేస్తూ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇందుకు చాలా కారణాలుంటాయి. కొందరికి కార్డియోమయోపతి అనే హృద్రోగం ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు గుండె వేగం పెరిగే వ్యాయామాలు చేసినప్పుడు, గుండెలో విద్యుత్‌ ప్రవాహంలో తేడాలు తలెత్తి హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. శరీరం తట్టుకోగలిగినదానికంటే తీవ్ర స్థాయిలో వ్యాయామాలు పెంచినా, గుండె మీద ఒత్తిడి పెరిగి ఆగిపోవచ్చు. రాజ్‌కుమార్‌ విషయంలోనూ ఇదే జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.

తెలిసీ తెలియకుండా వ్యాయమం చేయడం.. అతిగా వర్కవుట్లు చేసి శరీరాన్ని కష్టపెట్టడం.. రెండూ ప్రమాదకరమే. శరీరంలోని కొవ్వును రాత్రికి రాత్రే తగ్గించుకోవాలనే ఆతృత.. త్వరగా కండలు పెంచేయాలన్న అత్యుత్సాహం ఎప్పటికీ మంచిది కాదన్నది నిపుణుల మాట.

Also Read: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే..

గతంలో తెలుగు పవర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కన్నడ పవర్ స్టార్..