Movie Ticket Prices: సర్కారు వారి పాటకు సూపర్‌స్టార్ కోరస్!!.. సినిమా రేట్ల జీవోపై ఆచితూచి స్పందిస్తున్న హీరోలు, నిర్మాతలు..

|

Mar 09, 2022 | 7:40 AM

Movie Ticket Prices GO: కొంచెం నీరు.. కొంచెం నిప్పులా వున్న ఏపీ ప్రభుత్వపు తాజా జీవోకి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ప్రజలకు-పరిశ్రమకు మధ్య నిలబడి సమన్యాయం చేశారంటూ..

Movie Ticket Prices: సర్కారు వారి పాటకు సూపర్‌స్టార్ కోరస్!!.. సినిమా రేట్ల జీవోపై ఆచితూచి స్పందిస్తున్న హీరోలు, నిర్మాతలు..
Follow us on

Movie Ticket Prices GO: కొంచెం నీరు.. కొంచెం నిప్పులా వున్న ఏపీ ప్రభుత్వపు తాజా జీవోకి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ప్రజలకు-పరిశ్రమకు మధ్య నిలబడి సమన్యాయం చేశారంటూ మెగాస్టార్ చిరంజీవి వెంటనే సోషల్ మీడియాలో పాజిటివ్‌ మూడ్‌తో రియాక్ట్ అయ్యారు. మిగతా సినిమా వాళ్లు మాత్రం ఊ అనాలా ఊహూ అనాలా అనే సందిగ్ధంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. సదరు జీవోను ఒకటికినాలుగు సార్లు చదువుకుని… అవలోకనం చేసుకుని ఆ తర్వాత తమ హృదయ స్పందన తెలియజేస్తున్నారు. కొత్త జీవోపై ఒక అభిప్రాయానికి రావడానికి సూపర్‌స్టార్ మహేష్‌బాబుకైతే 24 గంటలు పట్టింది. మరుసటిరోజు రాత్రికి గాని ఆయన ట్విట్టర్ హ్యాండిల్‌లో రియాక్షన్ కనిపించలేదు. మా అభ్యర్థనల్ని ఓపిగ్గా విని, సవరించిన టిక్కెట్ ధరలతో కొత్త జీవో ఇచ్చారు.. సంతోషం.. భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికీ-మాకూ మధ్య మీరు ఇదే విధంగా మధ్యవర్తిత్వం చేయాలని కోరుకుంటున్నా అని ట్వీటారు మహేష్‌బాబు. సీఎంతో భేటీకి వెళ్లిన మెగాటీమ్‌లో సూపర్‌స్టార్ కూడా వున్నారు. కానీ.. ఆయన నెక్స్ట్ బిగ్ మూవీ మరో రెండునెలల తర్వాత మే 12న రాబోతోంది. సర్కారువారి ఆగ్రహానికి గురికావడం ఎందుకన్న ఆలోచనతోనే ఇలా ఆచితూచి స్పందించిందట ఘట్టమనేని క్యాంప్.

*ఇక పవర్‌స్టార్ ధోరణిలో మాత్రం ఇసుమంతైనా మార్పు లేదు. ఏపీ సెక్రటేరియట్‌లో కొత్త జీవో అలా వేడివేడిగా వండుతుండగానే.. ‘మనల్నెవడ్రా ఆపేది’ అనే హుక్‌లైన్‌తో భీమ్లానాయక్‌ నుంచి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. వకీల్‌సాబ్ మూవీకి ఒక్కరోజు ముందు టిక్కెట్ ధరలు తగ్గించి.. భీమ్లానాయక్ రిలీజైన పదిరోజుల తర్వాత అవే టిక్కెట్ ధరలు పెంచారంటూ.. ఏపీ సర్కార్‌పై సోషల్ మీడియాలో పీకే ఆర్మీ తరఫున ట్రోలింగ్ మొదలైంది.

*RRR నిర్మాత డీవీవీ దానయ్య అయితే టికెట్‌ రేట్ల ఉత్తర్వులపై ఆచితూచి స్పందించారు. తమ సర్కారువారి జీవోకు ప్రశంసించకుండా వుండలేకపోతున్నాం అంటూ సినిమాలో ఇద్దరు హీరోల తరఫున వకాల్తా పుచ్చుకుని ట్వీట్ చేశారు. ‘పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ మేలు చేసేలా వుంది మీ జీవో’ అంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. మరో రెండువారాల్లో రిలీజ్ కాబోతున్న RRR మూవీకి ఏపీలో టిక్కెట్ రేట్లు ఏ రేంజ్‌లో వుండబోతున్నాయన్న లెక్కలు ఇంకా ఖరారు కాలేదు. బిగ్ బడ్జెట్ మూవీస్‌కి ఐదో షో వేసుకునేలా బేషరతుగా అనుమతులిచ్చిన తెలంగాణా సర్కారుకు మాత్రం ఓపెన్‌గా జిందాబాద్ కొట్టింది డీవీవీ బ్యానర్‌.

*మరో నాలుగురోజుల్లో రిలీజయ్యే రాధేశ్యామ్‌ నుంచి మాత్రం ఏపీ కొత్త జీవోపై ఉలుకూ పలుకూ లేదు. తమ సినిమాకు స్పెషల్ షోస్, స్పెషల్ ధరలు నిర్ణయించుకునే హక్కు వుండేలా ప్రభుత్వంతో ఇప్పటికీ యువీ క్రియేషన్స్‌ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కొత్త జీవో ప్రకారం… కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగివుండాలన్న మెలిక.. రాధేశ్యామ్‌ దూకుడుకి బ్రేకులేసిందట. పైగా, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ లెక్కల్ని కూడా ప్రభుత్వం ముందు పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి మొట్టమొదటిగా రాధేశ్యామ్‌కే ఏర్పడింది మరి. సో… ఇకమీదట రిలీజయ్యే ప్రతీ సినిమాకూ ఇటువంటి ఒక ఇంట్రస్టింగ్ కహానీ తప్పదన్నమాట.

రాజా శ్రీహరి, టీవీ9 ఎంటర్‌టైన్‌మెంట్‌  డెస్క్..

Also Read:Mahesh Babu: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి చెల్లించండి.. స్కూటీని ఇంటికి తీసుకెళ్లండి..!

Gold, Silver Price Today: వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. స్థిరంగానే పసిడి రేటు..