
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, మీరా చోప్రా, అక్షా పార్ధసాని, నటాషా దోషి, కృతికర్భందా, మీతా రఘునాథ్.. ఇలా ఈ మధ్యన ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కారు. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ హారిక నారాయణ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన హస్కీ గొంతుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తన ప్రియుడు ‘పృథ్వినాథ్ వెంపటి’తో కలిసి ఏడడుగులు నడిచింది. వీరిద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించడంతో నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. అయితే రెండు వారాలు గడవక ముందే కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారీ లవ్ బర్డ్స్. సింపుల్ గా జరిగిన హారిక, పృథ్వీనాథ్ పెళ్లి వేడుకలో బిగ్ బాస్ విన్నర్, స్టార్ సింగర్ రేవంత్, మ్యూజిక్ డైరెక్టర్లు మణిశర్మ, ఎంఎం కీరవాణి తదితరులు సందడి చేశారు. కొత్త జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం హారిక నారాయణ్ పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హారిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా హారికా నారాయణ్ ఏపీలోని తూర్పు గోదావారి జిల్లాలోనే పుట్టింది. అయితే తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ఎక్కువగా ఉత్తరాదిలోనే పెరిగింది. జర్మనీ వెళ్లి ఉద్యోగం చేయాలనుకున్నా అనుకోని విధంగా గాయనిగా మారింది. నిహారిక ‘సూర్య కాంతం’ సినిమాతో సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మహేశ్ బాబు, రవితేజ, దళపతి విజయ్ తదితర స్టార్ హీరోల ఎంట్రీ సాంగ్స్ ను పాడి అలరించింది. ‘ఆచార్య’లోని ‘లాహే లాహే’, ‘సర్కారు వారి పాట’, రవితేజ రావణాసుర వంటి సాంగ్స్ హారికకు మంచి గుర్తింపు తెచ్చుపెట్టాయి. ప్రైవేట్ ఆల్బం సాంగ్స్ తోనూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోందీ స్టార్ సింగర్. ముఖ్యంగా హారిక హస్కీ గొంతుకు చాలా మంది అభిమానులు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.