
ప్రముఖ నటుడు ,నిర్మాత అశోక్ కుమార్ తన సినీ పరిశ్రమ ప్రవేశం, అనుభవాలు, మరియు వ్యక్తిగత సిద్ధాంతాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన సినిమా రంగంలోకి మొదట డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఆపై నిర్మాతగా అడుగుపెట్టారు. నటుడిగా మారాలనే కోరిక తనకు ఎన్నడూ లేదని, కేవలం నిర్మాతగా ఉండాలనేదే తన ఆశయమని ఆయన అన్నారు. అయితే, అనుకోకుండా వచ్చిన ఒక అవకాశంతో ఆయన నటుడిగా మారానని తెలిపారు. ఒక సందర్భంలో దర్శకుడు కోడి రామకృష్ణ గారిని తన సినిమాలో నటించమని అడిగినప్పుడు, ఆయన బదులుగా అశోక్ కుమారే తన చిత్రంలో నటించాలని షరతు పెట్టారట. తన పనిని పూర్తి చేసుకోవడానికి అశోక్ కుమార్ దానికి అంగీకరించారట. అలా “చెవిలో పువ్వు” చిత్రంతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. నిర్మాతగా తీసిన “చెవిలో పువ్వు” చిత్రం అపజయం పాలైనప్పటికీ, నటుడిగా అదే సినిమా ద్వారా వచ్చిన గుర్తింపు ఆయనకు కొంతకాలం “బ్రెడ్ అండ్ బట్టర్” గా నిలిచిందని తెలిపారు.
కష్టకాలంలో తన ఆస్తులను, కార్లను కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ నటన తనకు ఆర్థికంగా అండగా నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తన మనస్సాక్షికి జవాబుదారీగా ఉంటానని, కష్టాలను దాచకుండా ధైర్యంగా చెప్పుకోగలనని ఆయన వివరించారు. మానవ సంబంధాలకు ఆయన అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎదుటివారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, వారిని మనిషిగా మాత్రమే చూస్తానని ఆయన అన్నారు. చీరాలలోని తన చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ తనకు అండగా ఉన్నారని, స్నేహంలో డబ్బు, హోదా లాంటివి చూడకూడదని తెలిపారు. జీవితం శాశ్వతం కాదని, ఒట్టి చేతులతో వచ్చి, ఒట్టి చేతులతో వెళ్తామని ఆయన తత్వోపదేశం చేశారు.
నటుడిగా తనకు మంచి అవకాశాలు, గుర్తింపు లభించినప్పటికీ, మేనేజర్లను, పీఆర్వోలను లేదా మేకప్ మ్యాన్‌లను నియమించుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఇవన్నీ నిర్మాతపై అనవసరమైన భారమని భావించి, అటువంటి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. తన అసలు ఆశయం నిర్మాతగానే కొనసాగాలని, ఆసక్తి కూడా ఆ రంగంపైనే ఎక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తన ప్రయాణంలో విజయాలు, అపజయాలు సహజమని, అయితే ప్రస్తుత సినీ పరిశ్రమ గతంలో ఉన్నట్లుగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి